నిర్భయ నుంచి అభయ దాకా.. ఈ చరిత్ర ఎన్నాళ్లిలా?

by Maddikunta Saikiran |
నిర్భయ నుంచి అభయ దాకా.. ఈ చరిత్ర ఎన్నాళ్లిలా?
X

గతంలో నిర్భయ హత్యాచారం కేసు, మొన్నటికి మొన్న నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి కేసు నుండి ఇపుడు హాస్పిటల్లో ఏకంగా ఒక ట్రెయినీ డాక్టర్‌పై ఘోర హత్యాచారం.. వరుసగా ఈ దారుణ ఘటనలు వింటుంటే ఒళ్ళు జలదరిస్తోంది. 2012 నుంచి అత్యాచారం కేసులు పెరుగుతున్నాయే గానీ, వాటి సంఖ్య తగ్గడంలేదు. ఈ అత్యాచారాలకు ముగింపు ఎప్పుడో .. ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రం ర్యాలీలు తీయడం, కొవ్వొత్తులు వెలిగించడం. అవి అరిపోయాక ఆ సంఘటన మరిచిపోవడం అలవాటు అయిపొయింది అందరికీ. కానీ రేపటి రోజు ఆ చిన్నారి స్థానంలో గానీ, నిర్భయ స్థానంలో గానీ మన పిల్లల్ని చూసే పరిస్థితి రాకూడదంటే సమాజంలో ఎటువంటి మార్పులు తీసుకు రావాలి అని ఆలోచించే సమయం ఇది.!

అసలు లైంగికదాడి, హత్యాచారం వంటి దారుణ ఘటనలు జరగడానికి కారణాలు ఏంటో తెలుసుకుని వాటికి పరిష్కారం తెలుసుకుంటే సమాజంలో మార్పులు చూడవచ్చు. ఈ మధ్య కాలంలో టీవీల్లో, సినిమాల్లో ప్రకటనల్లో ఎక్కడ చూసినా, విన్నా ఒక మాటే చెపుతున్నారు. అమ్మాయిలకి ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెప్పేకన్న మీ అబ్బాయిలకు చదువుతో పాటు సంస్కారం నేర్పండి అంటున్నారు. దాంతోపాటు మహిళలపై, చిన్న పిల్లలపై లైంగిక దాడులను అరికట్టాలంటే కఠినమైన చట్టాలు, విద్య విధానంలో మార్పు తేవాలి. కుటుంబ విలువలు నేర్పాలి. మన దేశంలో పేదరికం, అక్షరాస్యత పూర్తిగా నిర్మూలించడం అసాధ్యం. చదువుకున్న వాడికైతే సంస్కారం నేర్పగలము కానీ చదువుకున్నుప్పటికీ మనసులో తప్పుడు ఆలోచనలు పెట్టుకున్న వాడికి, నాగరికత, సమాజం పట్ల బాధ్యత, భయం లేని వారికి ఎవరు నేర్పుతారు?

రెచ్చగొడితే లైంగికదాడులు చేస్తారా?

సమాజాన్ని బాగుపరచటంలో మీ వంతు సహాయం లేకపోయినా పర్వాలేదు కానీ సమాజంలో జరుగుతున్న సంఘటనలకు మీరు కారణం కాకూడదు. మన సమాజంలో చిన్నతనం నుంచి రకరకాల కారణంగా కుటుంబ విలువలు, మాట్లాడే పద్ధతి తెలియకుండా, మంచీ చెడూ తెలియకుండా పెరిగిన ఎంతో మంది ఈ సమాజంలో మన మధ్యలో తిరుగుతున్నారు. చదువుకున్నా కూడా చిన్నప్పటి నుంచి వాళ్లకు జరిగిన చేదు అనుభవాల వల్ల కొందరిలో మానసికోన్మాదపు వ్యక్తిత్వం వస్తుంది. అలాంటి వాళ్లకు చదువుతో పని లేదు. అమ్మాయిలు ఎదుటి వారిలో కోరికలను ప్రేరేపించే దుస్తులు వేసుకుంటేనే అత్యాచారాలు జరుగుతాయని గ్యారంటీ ఎక్కడుంది? కోల్‌కతా మెడికల్ కాలేజీలో ఆ ట్రెయినీ డాక్టర్ ఎలాంటి రెచ్చగొట్టే దుస్తులు వేసుకుందని ముష్కరులు అంత దారుణ కృత్యానికి ఒడిగట్టారు మూడేళ్ల పసిపాపలు, 70 ఏళ్ల ముదుసలులు ఎవరిని రెచ్చగొడుతున్నారని వారిమీద పడుతున్నట్లో మరి.

కఠిన చట్టాలు నేరాలను తగ్గిస్తాయా?

ప్రస్తుతం వున్న విద్యా వ్యవస్థలో మార్పు రావాలి. మనోవిజ్ఞానం అనే అంశాన్ని ఒక సబ్జెక్టు‌గా గుర్తించాలి. చిన్నప్పటి నుండే ప్రతీ స్టూడెంట్ మానసిక పరిస్థితిని గుర్తించడం, వారిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నాలు చేయాలి. ఒక హత్య కానీ, లైంగిక దాడి కానీ చేసిన వ్యక్తిని మెంటల్ హాస్పిటల్‌లో వుంచి కేస్ స్టడీ చేసి, తన మానసిక పరిస్థితికి కారణాలు కనుక్కుని ఆపై అతగాడికి జాప్యం లేకుండా కఠిన శిక్ష విధించాలి. అయితే కఠిన చట్టాలు విధించినంత మాత్రాన తప్పు చేయరనీ, లైంగిక దాడులు ఆగిపోతాయని అనుకోలేం. దుబాయ్, అమెరికా లాంటి దేశాల్లో తప్పు చేయటానికి భయపడతారు కాబట్టి అక్కడ నేరాలు ఏవీ జరగవని చెప్పగలమా?

సిగ్గుపడాల్సింది నేతలే...

మన దేశంలో మార్పు రావాలి అంటే చట్టాలు మారాలి, విద్యా వ్యవస్థ మారాలి. అందరికీ ఉచిత విద్య, అందరికీ క్రీడల్లో ఉచితంగా శిక్షణ ఇప్పిస్తే ఆరోగ్యమైన మనోవికాసంతో మన దేశం గర్వపడేలా ఒలింపిక్స్ లో గెలవగలుగుతారు. లేదా తప్పు దారుల్లో వెళ్లి ఇలాంటి హత్యాచారాలు చేస్తూనే వుంటారు. ఇలాంటి కేసు స్టడీలని మనోవిజ్ఞాన సబ్జెక్టులో చేర్చి ఒక ఉదాహరణగా చూపించాలి. ఎన్ని గవర్నమెంటు‌లు మారినా ఇలాంటి మార్పులు చేయకపోతే, ఆ నేతలు సిగ్గుపడాల్సి ఉంది. ఇదంతా జరిగే వరకు అమ్మాయిలు కాస్త జాగ్రత్త. నలుగురితో కలిసి నడుద్దాం, ఒంటరి ప్రయాణాలు, ఒంటరిగా స్నికౌట్‌‌లు (లాంగ్ డ్రైవ్, నైట్ డ్రైవ్) చేసి తల్లితండ్రులకు కడుపు కోత మిగల్చకండి.



- పి. కరుణ బిందు,

ప్రిన్సిపాల్, శ్రీ చైతన్య టెక్నో స్కూల్

Next Story

Most Viewed