మా అమ్మను రేవణ్ణ కిడ్నాప్ చేశాడు.. పోలీసులకు యువకుడి ఫిర్యాదు

by Hajipasha |
మా అమ్మను రేవణ్ణ కిడ్నాప్ చేశాడు.. పోలీసులకు యువకుడి ఫిర్యాదు
X

దిశ, నేషనల్ బ్యూరో : లైంగిక వేధింపుల వ్యవహారంలో ఇరుక్కున్న మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడ కుమారుడు హెచ్‌డీ రేవణ్ణపై మరో కేసు నమోదైంది. ఈసారి ఆయనపై కిడ్నాప్ కేసును పోలీసులు నమోదు చేశారు. సతీష్ బాబన్న అనే వ్యక్తి ద్వారా హెచ్‌డీ రేవణ్ణ తన తల్లిని కిడ్నాప్ చేయించి, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఓ 20 ఏళ్ల యువకుడు మైసూరు జిల్లాలోని కేఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశాడు. తన తల్లి గతంలో ఆరేళ్ల పాటు హెచ్‌డీ రేవణ్ణ ఫామ్ హౌస్‌లో పనిచేసిందని.. మూడేళ్ల క్రితమే అక్కడ పని మానేసిందని తెలిపాడు. ‘‘ఏప్రిల్ 23న హెచ్‌డీ రేవణ్ణ అనుచరుడు సతీష్ బాబన్న మా ఇంటికి వచ్చాడు. రేవణ్ణ భార్య భవానీ మా అమ్మను పిలుస్తోందని చెప్పాడు. దీంతో మా అమ్మ అతడి వెంట వెళ్లింది. ఏప్రిల్ 26న అమ్మను సతీష్ మా ఇంటికి తీసుకొచ్చి దిగబెట్టాడు. పోలీసులు వచ్చే అవకాశం ఉందని.. ఎక్కడికైనా కొన్ని రోజులు వెళ్లిపోవాలని మా ఇద్దరికి సూచించాడు. ఏప్రిల్ 29న రాత్రి 9 గంటలకు సతీష్ మళ్లీ మా ఇంటికొచ్చాడు.. రేవణ్ణ ఆదేశించాడని చెప్పి.. నా ముందు నుంచే మా అమ్మను బలవంతంగా లాక్కెళ్లాడు’’ అని సదరు యువకుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

లాక్కెళ్లే క్రమంలో..

‘‘మీ అమ్మ పోలీసులకు దొరికితే మేమంతా జైలుకు వెళ్తాం’’ అని అమ్మను లాక్కెళ్లే క్రమంలో సతీష్ తనతో చెప్పాడని సదరు యువకుడు వెల్లడించాడు. ఈ ఘటన జరిగాక.. తన తల్లి లైంగిక వేధింపుల వీడియో వైరల్ అయిందనే విషయాన్ని స్నేహితుల ద్వారా మే 1న తెలుసుకున్నానని యువకుడు చెప్పాడు. ఆ వీడియోలో తన తల్లి కాళ్లను కట్టేసి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘోరమైన దృశ్యాలు ఉన్నాయన్నాడు. ‘‘మే 1వ తేదీనే మా అమ్మ ఆచూకీ కోసం సతీష్‌కు కాల్ చేశాను. అతడు చెప్పింది విని షాకయ్యాను. ప్రజ్వల్ రేవణ్ణపై దాడి చేసేందుకు మీ అమ్మ కర్ర పట్టుకున్న ఫొటో బయటపడిందన్నాడు. ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని చెప్పాడు. ఇంకా బెయిల్ రావాల్సి ఉందన్నాడు’’ అని సదరు యువకుడు వివరించాడు. దీంతో తన తల్లిని హెచ్‌డీ రేవణ్ణ కిడ్నాప్ చేసి ఉండొచ్చని అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన తల్లిని ఎక్కడికి తీసుకెళ్లారో తెలియడం లేదని.. ఆమెకు ప్రాణ భయం ఉందన్నాడు.

Advertisement

Next Story

Most Viewed