సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్‌.. ఐదు షరతులివీ

by Hajipasha |
సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్‌.. ఐదు షరతులివీ
X

దిశ, నేషనల్ బ్యూరో : ఎన్నికల ప్రచారం కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్‌ కేజ్రీవాల్‌‌కు జూన్ 1 వరకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌‌ను మంజూరు చేసింది. దీంతో ఆయన శుక్రవారం సాయంత్రం తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటికి రాగానే.. కేజ్రీవాల్‌ను పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రిసీవ్ చేసుకున్నారు. అంతకుముందు శుక్రవారం ఉదయం సుప్రీంకోర్టులో విచారణ జరగగా.. ఎన్నికల ఫలితాల మరుసటిరోజైన జూన్‌ 5 వరకు బెయిల్‌ ఇవ్వాలంటూ సీఎం కేజ్రీవాల్‌ తరఫు న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ కోరారు. అయితే ఈ అభ్యర్థనను సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. జూన్‌ 2న కేజ్రీవాల్ లొంగిపోయి, తిరిగి తిహార్ జైలుకు వెళ్లాలని ఆదేశించింది. ఇక ఎన్నికల ప్రచారం కోసం కేజ్రీవాల్‌కు బెయిలివ్వడం సరికాదనే ఈడీ వాదనపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘‘ఏడాదిన్నర నుంచి ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు. ఇప్పుడు ఈ 21 రోజులు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసినంత మాత్రాన పెద్దగా తేడా ఏం ఉండదు’’ అని సుప్రీంకోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది.

ఐదు షరతులతో బెయిల్‌..

మధ్యంతర బెయిల్ ఇచ్చే సందర్భంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు దేశ సర్వోన్నత న్యాయస్థానం ఐదు షరతులు విధించింది. బెయిల్‌పై ఉండగా కేజ్రీవాల్ సీఎం కార్యాలయానికి గానీ.. ఢిల్లీ సచివాలయానికి గానీ వెళ్లొద్దని సుప్రీంకోర్టు సూచించింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తనపై వచ్చిన అభియోగాల గురించి ఎక్కడా మాట్లాడొద్దని కేజ్రీవాల్‌కు కోర్టు నిర్దేశించింది. ఈ కేసుకు సంబంధించిన అధికారిక ఫైళ్లను చూడొద్దని, సాక్షులతో మాట్లాడొద్దని న్యాయస్థానం ఆదేశించింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమోదానికి పంపే ఫైళ్లపై తప్ప ఇతర డాక్యుమెంట్లపై కేజ్రీవాల్ సంతకం చేయకూడదని పేర్కొంది. రూ.50వేలు విలువైన బెయిల్ బాండ్‌‌తో పాటు అంతే మొత్తానికి ఒకరి ష్యూరిటీని తిహార్ జైలు సూపరింటెండెంట్‌‌కు అందించాలని కేజ్రీవాల్‌కు సూచించింది. ఈ తీర్పు అనంతరం సీఎం కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంపై కోర్టు ఎలాంటి ఆంక్షలు విధించలేదని వెల్లడించారు. లిక్కర్ స్కాం కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అంతకుముందు ఈ కేసులో విచారణకు రావాలంటూ తొమ్మిదిసార్లు ఈడీ సమన్లు జారీ చేసింది. వాటికి కేజ్రీవాల్ స్పందించకపోవడంతో అదుపులోకి తీసుకుంది.

ఒక గొప్ప ఉద్దేశం కోసం కేజ్రీవాల్ బయటకు : ఆప్ నేతలు

కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు కావడంపై ఆప్‌ నేతలు స్పందించారు. ఒక గొప్ప ఉద్దేశం కోసం కేజ్రీవాల్ బయటకు వస్తున్నారని వ్యాఖ్యానించారు. ‘‘రాజ్యాంగాన్ని విశ్వసించే ప్రతిఒక్కరికీ సుప్రీంకోర్టు తీర్పు ఒక ఆశాకిరణం లాంటిది. మా పార్టీ, ఢిల్లీ ప్రజల తరఫున కృతజ్ఞతలు. ఇది కేజ్రీవాల్‌కు దక్కిన ఊరట మాత్రమే కాదు.. సత్యానికి దక్కిన విజయం. ఇది ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి దక్కిన భారీ విజయం. ప్రజాస్వామ్యాన్ని రక్షించడంలో కోర్టు కీలక పాత్ర పోషించింది. అసాధారణ పరిస్థితుల్లో ఈ బెయిల్ మంజూరైంది’’ అని వారు హర్షం వెలిబుచ్చారు.

కాంగ్రెస్, టీఎంసీ స్పందన ఇదీ..

‘‘కేజ్రీవాల్‌కు బెయిల్ లభించినందుకు సంతోషంగా ఉంది. ప్రస్తుత ఎన్నికల సమయంలో ఇదెంతో ఉపయోగకరంగా ఉంటుంది’’ అని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు. కాంగ్రెస్ నేత పవన్ ఖేడా మాట్లాడుతూ..‘‘ కేజ్రీవాల్‌కు బెయిల్ ఇస్తూ సుప్రీం ఇచ్చిన ఉత్తర్వులను స్వాగతిస్తున్నాం. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు కూడా తగిన న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం’’ అని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed