Farmers issues: రైతుల సమస్యల పరిష్కారానికి కమిటీ వేస్తాం: సుప్రీంకోర్టు

by vinod kumar |
Farmers issues: రైతుల సమస్యల పరిష్కారానికి కమిటీ వేస్తాం: సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: రైతుల సమస్యలను సామరస్య పూర్వకంగా పరిష్కరించేందుకు త్వరలోనే బహుళ సభ్య కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. వారం రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని పేర్కొంది. రైతులకు సంబంధించిన తాత్కాలిక సమస్యలను ఆ కమిటీకి ఇవ్వాలని పంజాబ్, హర్యానా ప్రభుత్వాలను కోరింది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు నిరసన తెలుపుతున్న రైతులతో నిమగ్నమై ఉండాలని, ట్రాక్టర్లు, ట్రాలీలను హైవే నుంచి తొలగించేలా వారిని ఒప్పించాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం సూచించింది. ఫిబ్రవరి 13 నుంచి నిరసన తెలుపుతున్న రైతులు అంబాలా సమీపంలోని శంభు సరిహద్దులో ఏర్పాటు చేసిన బారికేడ్లను వారం రోజుల్లోగా తొలగించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ హర్యానా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం గురువారం విచారించింది.

పంజాబ్, హర్యానా పోలీసు డైరెక్టర్ జనరల్స్‌తో పాటు పాటియాలా, అంబాలా సీనియర్ పోలీసు సూపరింటెండెంట్, రెండు జిల్లాల డిప్యూటీ కమిషనర్‌లు ఒక వారంలోపు సమావేశం నిర్వహించి పాక్షిక విధివిధానాలను రూపొందించాలని కోర్టు ఆదేశించింది. రాష్ట్రాలు మాత్రమే కాకుండా, న్యాయస్థానం కూడా రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వీలుగా ఒక ఫోరమ్‌ను రూపొందించేందుకు మొగ్గు చూపుతోందని వెల్లడించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 2న వాయిదా వేసింది. కాగా, సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చాలు తమ డిమాండ్‌లకు మద్దతుగా ఢిల్లీలో నిరసన చేస్తామని ప్రకటించడంతో హర్యానా ప్రభుత్వం ఫిబ్రవరిలో అంబాలా-న్యూఢిల్లీ జాతీయ రహదారిపై బారికేడ్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed