కంబోడియాలో 'నకిలీ ఉద్యోగాల'పై భారతీయులకు కేంద్రం హెచ్చరిక

by S Gopi |
కంబోడియాలో నకిలీ ఉద్యోగాలపై భారతీయులకు కేంద్రం హెచ్చరిక
X

దిశ, నేషనల్ బ్యూరో: కంబోడియాలో ఉద్యోగావకాశాల కోసం చూస్తున్న భారతీయులకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. కంబోడియాలో ఏదైనా ఉద్యోగాన్ని ఎంచుకునే సమయంలో జాగ్రత్త వహించాలని, తప్పుడు ప్రకటనలు, ట్రాఫికింగ్ మోసాలకు గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. 'కంబోడియాలో లాభదాయకమైన ఉద్యోగావకాశాల గురించి ఫేక్ యాడ్స్ విషయంలో భారతీయులు మోసపోతున్నారు. తద్వారా మానవ అక్రమ రవాణా నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారని తమ దృష్టికి వచ్చింది. కొందరు ఆన్‌లైన్ ఆర్థిక మోసాలు, ఇతర చట్ట విరుద్ధ కార్యకలాపాలకు బలవుతున్నారు ' అని కేంద్రం పేర్కొంది. అటువంటి మోసాలకు గురవకుండా ఆ దేశంలో పనిచేయాలని భావించే భారతీయులు తప్పనిసరిగా అధీకృత ఏజెంట్ల ద్వారా మాత్రమే వెళ్లాలని, వెళ్లడానికి ముందు పనిచేసే సంస్థ లేదా యజమానుల నేపథ్యాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడం మంచిదని సూచించింది. దీనికి సంబంధించి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బాధిత భారతీయులకు సాయం చేసేందుకు నమ్ పెన్‌లోని కంబోడియన్ అధికారులతో సంప్రదిస్తున్నామని పేర్కొంది. ఇటీవల ఉద్యోగాలు లభిస్తాయనే నమ్మకంతో కంబోడియాలో 5,000 మంది భారతీయులు బలవంతంగా అక్కడ నిర్భందించబడిన ఘటన వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో కేంద్రం తాజా హెచ్చరికను జారీ చేసింది. చాలామంది డేటింగ్ యాప్‌ల నుంచి భారతీయులను మోసగించినట్టు నివేదిక పేర్కొంది.

Advertisement

Next Story