- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కుంభమేళ అర్థరహితం.. లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు

- ఢిల్లీ సంఘటన దురదృష్టకరం
- రైల్వే మంత్రి బాధ్యత వహించాలి
దిశ, నేషనల్ బ్యూరో: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాను ఉద్దేశించి ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుంభమేళా ఒక అర్థరహితమైన కార్యక్రమమని ఆయన అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటపై స్పందించాలని కోరగా.. ఆయన పై వ్యాఖ్యలు చేశారు. కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి భారీగా భక్తులు తరలి వస్తుండటంతో ప్రభుత్వానికి నిర్వహణకు సంబంధించిన ఏమైనా సలహాలు ఇస్తారా అని ఆదివారం లాలూను మీడియా ప్రశ్నించింది. దీనికి స్పందిస్తూ.. కుంభమేళాకు ఏమైనా అర్థం ఉందా? ఇదొక అర్థం పర్థం లేని కార్యక్రమం అంటూ కొట్టి పారేశారు. ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట చాలా దురదృష్టకరమని లాలూ అన్నారు. రైల్వే శాఖ నిర్వహణా లోపమే ఈ ఘోర దుర్ఘటనకు కారణమని చెప్పారు. మృతుల కుటుంబీకులకు, గాయపడిన వారికి తన సానుభూతిని తెలియజేశారు. రైల్వే శాఖ చేసిన తప్పుకు ఎంతో మంది ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందని బాధపడ్డారు. ఈ ఘటనకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
కాగా, కుంభమేళాపై లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. ఈ వ్యాఖ్యలు ఆర్జేడీ ఆలోచనా విధానాన్ని సూచిస్తున్నాయని బీజేపీ బీహార్ అధికార ప్రతినిధి మనోజ్ శర్మ అన్నారు. బుజ్జగింపు రాజకీయాల వల్లే లాలూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఆర్జేడీ నాయకులు ఎప్పుడూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూనే ఉంటారు. తాజాగా కుంభమేళా ఒక అర్థం లేని వ్యవహారం అని లాలూ ప్రసాద్ అనడం ఆ పార్టీకి హిందూ మతంపై ఉన్న అభిప్రాయాన్ని బయట పెట్టిందని శర్మ చెప్పారు.
బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా కూడా లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఆయన సనాతన ధర్మంపై ఎప్పుడూ దాడి చేస్తూనే ఉంటారు. సనాతన ధర్మం, హిందూ మత గురువులపై ఎప్పుడూ ఇలాంటి ఆలోచనా విధానాన్నే కలిగి ఉంటారు. బుజ్జగింపు రాజకీయాలకు అలవాటు పడి ఆ పార్టీ నేతలు చివరకు తమ సొంత విలువలను కూడా వదిలేశారని లాలూపై మండిపడ్డారు.