- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
రేపటి ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నిజం కానున్నాయి?

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు శనివారంతో ముగియనున్నాయి. దీంతో అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్‌పై పడింది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా.. ఫలితాలకు ముందు జూన్ 1న ఓటింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే అనేక పోలింగ్ ఏజెన్సీలతో పాటు న్యూస్ ఛానెళ్లు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయనున్నాయి. ఈ అంచనాలు ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ, పదేళ్లుగా గెలుపు కోసం ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి భవిష్యత్తును ఎంతో కొంత నిజం చేయనున్నాయి. అయితే, కొన్నేళ్లుగా మారుతున్న రాజకీయ యవనికపై అంచనాలు గాడి తప్పుతున్న పరిణామాల మధ్య ఈసారి ఎగ్జిట్ పోల్స్‌పై ఆసక్తి నెలకొంది. కొంతమంది విశ్లేషకుల ప్రకారం ఎగ్జిట్ పోల్స్ అంచనాలు దారి తప్పడానికి కొన్ని కారణాలను చెబుతున్నారు. వాటిలో ప్రధానమైనవి..
వివిధ మీడియా సంస్థలు తాము నిర్వహించిన వివిధ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను జూన్ 1 సాయంత్రం 6:30 గంటల తర్వాత ప్రకటిస్తాయి.
* ప్రాథమిక అంచనాల్లో పొరపాటు: వ్యక్తిగత అడిగిన సందర్భాల్లో ఏజెన్సీలు, న్యూస్ ఛానెళ్లు అడిగినప్పుడు ఓటర్లు తమ నిజమైన ఓటు నిర్ణయాన్ని చెప్పరు. వాటిని నిజమనే ఊహతో ఎగ్జిట్ పోల్స్ పనిచేస్తాయి. అయితే, ఈ అంచనాలు తప్పే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంతమంది ఉద్దేశపూర్వకంగా నిజాలను బహిర్గతం చేయకుండా మాట్లాడేస్తారు. మరికొందరు భయంతోనో, సామాజిక ఒత్తిడితోనో ఖచ్చితమైన అభిప్రాయాన్ని చెప్పకుండా దాచేస్తారు. ఇవి కాకుండా కొన్నిసార్లు ఎగ్జిట్ పోల్స్ సేకరణ ఎక్కువగా ఓటింగ్ బూత్‌ల వెలుపన జరుగుతాయి. దానివల్ల ఓటర్లు ప్రచారంలో ఎలాంటి అభిప్రాయాలు వినబడతాయో వాటినే చెబుతారు. వారి సొంత నిర్ణయాలను బహిర్గతం చేయరు.
* టఫ్ ఫైట్: ఎగ్జిట్ పోల్స్ సాధారణంగా 1-3 శాతం మధ్య తేడాతో నిజమవుతాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఈ మార్జిన్ శాతమే కీలకంగా మారుతుంది. ఉదాహరణకు 2018లో రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాలు చాలా దగ్గరగా 1 శాతం కంటే తక్కువ ఓట్ల తేడాతో గెలుపు నిర్ణయించబడింది. కాబట్టి ఇలాంటి సమయాల్లో ఎగ్జిట్ పోల్స్ విఫలమవుతుంటాయి.
* ఖర్చులు, విధానపరమైన ఒత్తిళ్లు: కొన్నిసార్లు బడ్జెట్, సమయం కారణంగా ఎగ్జిట్ పోల్స్‌లో నాణ్యత కొరవడుతుంది. చాలావరకు మీడియా ఛానెళ్లు ఖర్చు విషయంలో రాజీపడి పనిచేస్తాయి. దీనివల్ల పరిశోధనా, డేటా సేకరణ క్షేత్రస్థాయిలో ప్రభావితం అవుతుంది. అంతేకాకుండా ఫలితాల అంచనాలను తక్కువ సమయంలో అందించాలనే ఒత్తిడిలో టెక్నాలజీ, ఫోన్ ద్వారా సమాచారం సేకరించడంపై ఆధారపడతాయి. తద్వారా గ్రౌండ్ రియాలిటీకి దూరంగా ఎగ్జిట్ పోల్స్ నిర్ణయించబడతాయి.
* శాంపిల్ సేకరణలో తప్పిదాలు: టెక్నాలజీ పెరిగినప్పటికీ శాంపిళ్లను సేకరించడంలో వ్యక్తుల లోపాలు ఎగ్జిట్ పోల్స్ వైఫల్యానికి కారణాలుగా నిలుస్తాయి. అభిప్రాయ సేకరణ సమయంలో వ్యక్తులు తమకు అనుకూలమైన పోలింగ్ బూత్‌ల నుంచి వివరాలు తెప్పించుకోవచ్చు. దానివల్ల ఫలితాలు తారుమారవుతాయి. ఇది ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో జరుగుతుంది.
* గతంలో ఉన్న డేటాపై ఆధారపడటం: ఎగ్జిట్ పోల్స్‌ను విశ్లేషించేందుకు తరచుగా గతంలో జరిగిన ఎన్నికల డేటాపై చాలామంది ఆధారపడతారు. కానీ భారత్ లాంటి భిన్నమైన దేశంలో, పెరుగుతున్న జనాభా, మారుతున్న ఓటర్ల అభిప్రాయాలను గతంలో సేకరించిన డేటా ప్రతిబింబించకపోవచ్చు.
* కుల, సామాజిక, ఆర్థిక డేటా లోపం: కుల, సామాజిక, ఆర్థిక జనాభా వివరాలు సమగ్రంగా లేకపోవడం వల్ల కూడా ఖచ్చితమైన పోలింగ్ సరళిని అంచనా వేయలేం. 1934 తర్వాత మనదేశంలో కుల గణన ప్రక్రియ నిర్వహించలేదు. దీనివల్ల ఎవరు ఎటువైపు మొగ్గారనే దానిపై అంచనాలను లెక్కించడం క్లిష్టంగా మారింది. అదేవిధంగా ఓటర్ల ఆర్థిక స్థితికి సంబంధించిన డేటా ఉండకపోవడం వల్ల ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితత్వాన్ని నిర్ణయించలేవు.
* మహిళల ప్రాధాన్యత: ప్రతి ఎన్నికలకు మహిళా ఓటర్ల ప్రభావం పెరుగుతున్నప్పటికీ, ఎగ్జిట్ పోల్స్ తరచుగా వీరిని అడ్రస్ చేయడంలో విఫలమవుతుంటాయి. మొత్తం ఓటర్ల జానాభాలో సగం మంది మహిళలు ఉన్నప్పటికీ, సర్వేలు సేకరించే శాంపిళ్లలో వారి శాతం 25-30 మధ్య మాత్రమే ఉంటుంది. ఇది ఎన్నికల ఫలితాల అంచనాలను లెక్కగట్టంతో లోపాలకు దారితీస్తుంది. ప్రత్యేకించి పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్న నియోజకవర్గాల్లో ఈ పొరపాటు తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
చివరగా, ఎగ్జిట్ పోల్స్ ప్రజాభిప్రాయాన్ని అంచనా వేసేందుకు అవసరమైన సాధంగా పనిచేస్తున్నాయి. అయితే వాటి విశ్వసనీయత వివిధ పరిమితులు, సవాళ్లకు లోబడి ఉంటాయి. కాబట్టి తాజా ఎన్నికల ఫలితాల కోసం యావత్ దేశమే ఎదురుచూస్తున్న వేళ ఓటర్ల నాడిని ఈసారి ఎగ్జిట్ పోల్స్ ఏమేరకు పసిగట్టాయో వేచి చూడాల్సిందే..