జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఆర్మీ సిబ్బందికి గాయాలు

by Harish |   ( Updated:2024-07-18 09:42:33.0  )
జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఆర్మీ సిబ్బందికి గాయాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల జమ్మూకశ్మీర్ వరుస ఎన్‌కౌంటర్‌లతో అట్టుడికిపోతుంది. తాజాగా మరోసారి గురువారం తెల్లవారుజామున దోడా జిల్లాలోని మారుమూల అటవీ గ్రామంలో ఉగ్రవాదులు, భద్రతా సిబ్బందికి మధ్య కాల్పులు చోటు చేసుకోగా ఈ ఘటనలో ఇద్దరు ఆర్మీ జవాన్లు గాయపడ్డారు. దోడా జిల్లాలో ఉగ్ర కదలికలు పెరిగిన నేపథ్యంలో గత నాలుగు రోజులుగా భద్రతా దళాలు అక్కడ సెర్చ్ ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో కస్తిగర్ ప్రాంతంలోని జద్దన్ బాటా గ్రామంలో భద్రతా సిబ్బంది ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక శిబిరంపై ఉగ్రవాదులు అకస్మాత్తుగా కాల్పులు జరపడంతో, బలగాలు కూడా ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఇద్దరు ఆర్మీ సిబ్బందికి గాయాలు అయ్యాయి. ఈ కాల్పులు తెల్లవారుజామున 2 గంటల ప్రాంతలో జరిగాయి.

దట్టమైన అటవీ ప్రాంతం, పైగా భారీ వర్షాలు కురుస్తుండటం, భారీ పొగమంచు కారణంగా ఉగ్రవాదుల అన్వేషణకు అడ్డంకులు ఏర్పడుతున్నాయని అధికారి తెలిపారు. మంగళవారం, బుధవారం మధ్య రాత్రి కూడా అక్కడి అడవులలో స్వల్పకాలిక కాల్పులు జరిగాయి. సోమవారం రాత్రి ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడిన కెప్టెన్‌తో సహా నలుగురు భారత జవాన్లు మృతి చెందారు. దీనికి ప్రతీకారంగా ఉగ్రవాదులను అంతమొందించి ఆ ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు భద్రతా బలగాలు కృతనిశ్చయంతో అక్కడి ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed