Encounter: కశ్మీర్‌లోని కుల్గామ్‌లో ఎన్ కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

by vinod kumar |
Encounter: కశ్మీర్‌లోని కుల్గామ్‌లో ఎన్ కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో శనివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆదిగామ్ దేవ్‌సర్ ప్రాంతంలో టెర్రరిస్టులు ఉన్నారనే సమాచారంతో సైన్యం, కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు జవాన్లపై కాల్పులు జరపగా తిరిగి సైన్యం ఎదురు కాల్పులు జరిపింది. దీంతో ఇద్దరు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోగా.. నలుగురు జవాన్లు, ఓ పోలీస్ అధికారి గాయపడ్డారు. క్షతగాత్రులైన వారిని కుల్గామ్ అదనపు ఎస్పీ ముంతాజ్ అలీ భట్టి, రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన జవాన్లు మోహన్ శర్మ, సోహన్ కుమార్, యోగిందర్, మహ్మద్ ఇస్రాన్‌లుగా గుర్తించారు. వీరందరినీ చికిత్స నిమిత్తం శ్రీనగర్‌లోని 92 బేస్ ఆస్పత్రికి తరలించారు. ఘటనా ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించి ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

అంతకుముందు ఈ నెల 27న పుల్వామాలోని అవంతిపొరాలో పోలీసులు టెర్రరిస్టుల స్థావరాలను కనుగొన్నారు. జైషే మహ్మద్‌కు చెందిన ఆరుగురు ఉగ్రవాదులను అరెస్టు చేసి వారి నుంచి 5 ఐఈడీలు, 30 డిటోనేటర్లు, 17 ఐఈడీ బ్యాటరీలు, 2 పిస్టల్స్ సహా పలు ఆయుధ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఆర్టికల్ 370 రద్దు తర్వాత పదేళ్ల తర్వాత జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగుతున్నాయి. మూడు దశల్లో పోలింగ్ జరగనుండగా.. ఈ నెల18న తొలిదశ, 25న రెండో దశ ఎన్నికలు ముగిశాయి. అక్టోబర్ 1న మూడో దశ పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఉగ్ర కార్యకలాపాలు పెరుగుతుండటంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed