సినిమా థియేటర్లలో ఎన్నికల ఫలితాలు.. టికెట్ల రేట్లు ఇవే

by Hajipasha |
సినిమా థియేటర్లలో ఎన్నికల ఫలితాలు.. టికెట్ల రేట్లు ఇవే
X

దిశ, నేషనల్ బ్యూరో : ఎన్నికల సందడి చివరికి సినిమా థియేటర్లకు కూడా చేరింది. శనివారం (జూన్ 1న) రోజు సార్వత్రిక ఎన్నికల తుది విడత పోలింగ్ ఘట్టం ముగియనుంది. ఆ తర్వాత జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపుపైనే అందరి దృష్టి ఉంది. గెలిచేది ఎవరు ? ఓడేది ఎవరు ? అనే దానిపై మంగళవారం ఉదయం క్లారిటీ వచ్చేస్తుంది. ఆ టైంలో చాలామంది టీవీలు, ఫోన్లకు అత్తుకుపోతుంటారు. ఉత్కంఠగా ఎన్నికల ఫలితాలను వీక్షిస్తుంటారు. అవే ఎన్నికల ఫలితాలను బిగ్‌ స్క్రీన్‌పై సినిమా రేంజులో చూసే అవకాశం లభిస్తే.. భలేగా ఉంటుంది కదూ. ఇలాంటి అభిరుచిని కలిగిన రాజకీయ పార్టీల క్యాడర్ కోసం మహారాష్ట్రలోని కొన్ని సినిమా థియేటర్లు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ఆ థియేటర్లలో జూన్ 4న ఎన్నికల ఫలితాలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

థియేటర్ల లిస్టు ఇదే..

ఎన్నికల రిజల్టును లైవ్‌లో ప్రసారం చేయనున్న సినిమా థియేటర్ల విషయానికి వస్తే.. ముంబైలోని ఎస్‌ఎం5 కల్యాణ్‌, సియాన్‌, కంజూర్‌మార్గ్‌లోని మూవీమ్యాక్స్‌ థియేటర్లు ఉన్నాయి. ఇక థాణేలోని ఎటర్నిటీ మాల్‌, వండర్‌ మాల్‌, నాగ్‌‌పూర్‌లోని మూవీమ్యాక్స్‌ ఎటర్నిటీ, పూణేలోని మూవీమ్యాక్స్‌ థియేటర్లు ఎన్నికల ఫలితాలను బిగ్ స్క్రీన్‌పై ప్రేక్షకులకు చూపించనున్నాయి.

టికెట్ల రేట్లు ఇవే..

ఆరు గంటల పాటు ఎన్నికల ఫలితాలను థియేటర్లలో లైవ్‌ స్ట్రీమ్‌ చేయనున్నారు. ఇందుకోసం రూ.99 నుంచి రూ.300 వరకు వివిధ రేంజ్‌లలో టికెట్లను అమ్ముతున్నారు. ఎంత ఎక్కువ రేటు పెడితే అంత ఎక్కువ సౌకర్యవంతమైన సీటింగ్, ఇతర సౌకర్యాలు లభిస్తాయి. ఈ స్పెషల్ సెషన్ కోసం పేటీఎం వంటి డిజిటల్ పేమెంట్ వేదికల్లో ఇప్పటికే టికెట్ల అమ్మకాలను ప్రారంభించాయి. కొన్ని థియేటర్లలో దీనికి సంబంధించిన టికెట్లు హౌస్‌ఫుల్‌ అయినట్లు తెలుస్తోంది. పలు రాజకీయ పార్టీల బడా నాయకులు తమ క్యాడర్ కోసం ఈ టికెట్లను గంపగుత్తగా కొన్నట్లు సమాచారం. పేటీఎంలో ఈ టికెట్ల బుకింగ్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story