అజిత్ పవార్ ఎన్సీపీ అభ్యర్థుల ఓటమికి షిండే స్కెచ్ ?

by Shamantha N |
అజిత్ పవార్ ఎన్సీపీ అభ్యర్థుల ఓటమికి షిండే స్కెచ్ ?
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్సీపీ అభ్యర్థుల ఓటమికి ప్రయత్నించారన్న వ్యాఖ్యలపై రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ కు మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే నోటీసులు పంపారు. ఈ లీగల్ నోటీసులను సోషల్ మీడియా ఎక్స్ లో సంజయ్ రౌత్ పోస్టు చేశారు. చాలా ఆసక్తికరమైన, ఫన్నీ పొలిటికల్ డాక్యుమెంట్ అని ఆ పోస్టుకు క్యాప్షన్ జత చేశారు. మహారాష్ట్ర సీఎం షిండేనే నోటీసులు పంపినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. మే 26న శివసేన పత్రిక సామ్నాలో షిండేపై సంజయ్ రౌత్ సంచలన వ్యాసం చేశారు. ‘‘అజిత్ పవార్ ఎన్సీపీ అభ్యర్థుల ఓటమి కోసం సీఎం షిండే చాలా కష్టపడుతున్నారు. అందుకోసం ఈ లోక్ సభ ఎన్నికల్లో ఆయన కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు’’ అని ఆరోపించారు. అయితే, సంజయ్ రౌత్ తప్పుడు ప్రకటనలు చేశారని లీగల్ నోటీసులో షిండే పేర్కొన్నారు. ఈ కామెంట్స్ తన పరువుకు నష్టం కలిగించేలా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని తెలిపారు. తన ఆరోపణలు నిజం చేసేలా సాక్ష్యాలను సమర్పించాలని కోరారు. అలా చేయకపోతే మూడు రోజుల్లోగా క్షమాపణ చెప్పాలని.. లేదంటే క్రిమినల్, సివిల్ ప్రొసీడింగ్స్ ఎదుర్కోవాలని హెచ్చరించారు. ఇకపోతే, మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమిలో బీజేపీ, షిండే వర్గానికి చెందిన శివసేన, అజిత్ నేతృత్వంలోని ఎన్సీపీ భాగస్వామ్యులుగా ఉన్నాయి. అధికార కూటమి మధ్య చిచ్చు పెట్టేలా సంజయ్ రౌత్ ఆరోపణలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed