‘లిక్కర్ కేసు’లో ఆప్ ఎమ్మెల్యే, కేజ్రీవాల్ సెక్రెటరీని ప్రశ్నించిన ఈడీ

by Swamyn |
‘లిక్కర్ కేసు’లో ఆప్ ఎమ్మెల్యే, కేజ్రీవాల్ సెక్రెటరీని ప్రశ్నించిన ఈడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ‘ఢిల్లీ మద్యం కుంభకోణం’ కేసులో అధికార ఆప్‌కు చెందిన మరో ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్‌‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరెట్(ఈడీ) సోమవారం ప్రశ్నించింది. దుర్గేశ్‌తోపాటు సీఎం కేజ్రీవాల్ ప్రైవేట్ సెక్రెటరీ బిధవ్ కుమార్‌ను సైతం విచారించింది. వీరిద్దరిని గతంలోనే విచారించిన ఈడీ.. తాజాగా మరోసారి ప్రశ్నించడం గమనార్హం. సంబంధిత కేసులో కొత్త విషయాలు వెలుగులోకి రావడంతో తాజా దర్యాప్తులో వీరి స్టేట్‌మెంట్లను ఈడీ రికార్డు చేసుకుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మొదటి నుంచి సీఎంకు సన్నిహితుడిగా పేరొందిన బిధవ్ కుమార్‌‌ను.. కేజ్రీవాల్‌ ఎవరెవరిని కలిశారన్న వివరాలను ఆరాదీసినట్టు సంబంధిత అధికారి ఒకరు తెలిపినట్టు ఓ జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది. జైలులో ఉన్న కేజ్రీవాల్‌ను సందర్శించడానికి అనుమతించిన ఐదుగురు వ్యక్తుల జాబితాలో కుమార్ కూడా ఉన్నారు. మద్యం కుంభకోణం కేసు నిందితుల్లో 36మంది, సాక్ష్యాలను దొరక్కుండా చేయడానికి దాదాపు 170 ఫోన్లను ధ్వంసం(లేదా మార్చారని) చేశారని ఈడీ గతంలో తన చార్జిషీట్‌లో ఆరోపించింది. ఈ చార్జిషీట్‌లో ఢిల్లీ మాజీ సీఎం మనీశ్ సిసోడియాతోపాటు కుమార్ పేరు కూడా ఉంది. మరోవైపు, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ క్యాంపెయిన్‌కు సంబంధించిన అంశాలపై ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్‌ను విచారించినట్టు తెలుస్తోంది. మద్యం కుంభకోణం కేసులో సౌత్ గ్రూప్ నుంచి అందిన రూ.100 కోట్లలో రూ.45 కోట్లను గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు చేశారని ఈడీ గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే. ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న వ్యక్తులకు నగదు చెల్లింపులు జరిగాయని, ఈ చెల్లింపులను ప్రస్తుతం జైలులో ఉన్న ఆప్ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జ్ విజయ్ నాయర్, దుర్గేశ్ పాఠక్ నిర్వహించారని ఈడీ గతంలో కోర్టుకు తెలిపింది. ఇదిలా ఉండగా, దుర్గేశ్ పాఠక్‌కు ఈడీ సమన్లను జారీచేయడంతో ఆప్ మంత్రి అతిషి స్పందించారు. ఈడీ, బీజేపీ మధ్య రాజకీయ కూటమిలో భాగస్వామిగా ఉన్నాయని, లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఆప్ నేతలను పాల్గొనకుండా చేయడమే ఈ కూటమి లక్ష్యమని ఆరోపించారు.


Advertisement

Next Story

Most Viewed