Mumbai Alert: ముంబైలో భారీ వర్షాలు.. విమాన ప్రయాణికులకు కీలక అప్‌డేట్

by Harish |
Mumbai Alert: ముంబైలో భారీ వర్షాలు.. విమాన ప్రయాణికులకు కీలక అప్‌డేట్
X

దిశ, నేషనల్ బ్యూరో: గత కొద్ది రోజులుగా దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజా రవాణా చాలా వరకు స్తంభించిపోయింది. ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థ ఇండిగో తన ప్రయాణికులకు కీలక విజ్ఞప్తి చేసింది. రాబోయే 24 గంటల్లో వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ముంబై నుంచి వెళ్తున్న లేదా రావాల్సిన వారు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌లో విమానాల స్టేటస్‌ను చెక్ చేసుకోవాలని సూచించింది. తీవ్రమైన గాలులు, వర్షాల వలన విమాన రాకపోకల సమయాల్లో మార్పులు సంభవించే అవకాశం ఉంది. అలాగే పరిస్థితి మరింత తీవ్రం అయితే వాటిని రద్దు కూడా చేయవచ్చు, కాబట్టి ప్రయాణికులు విమానాల స్టేటస్‌ను నిరంతరం చెక్ చేసుకోవాలని ఇండిగో కోరింది.

మరోవైపు నగర పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. తీరప్రాంతాల్లో సముద్ర అలలు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో అక్కడికి వెళ్లవద్దని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. ప్రస్తుతం మెరైన్ డ్రైవ్ బీచ్‌లో అలలు ఎగసిపడుతున్నాయి. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వాతావరణం ప్రతికూలత కారణంగా అహ్మదాబాద్ నుంచి ముంబైకి వెళ్లవలసిన విస్తారా విమానాన్ని కూడా దారి మళ్లించారు. భారీ వర్షాల కారణంగా శనివారం దక్షిణ ముంబైలోని నాలుగు అంతస్తుల ఇంట్లో బాల్కనీలో ఒక భాగం కూలిపోవడంతో 80 ఏళ్ల వృద్ధురాలు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో వివిధ నగరాల్లో వరద కారణంగా ట్రాఫిక్ స్తంభించిపోయింది.



Next Story