2017 నాటి ఘటనపై డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు

by Mahesh |   ( Updated:2023-06-28 10:07:41.0  )
2017 నాటి ఘటనపై డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2017 నాటి నిరసనల విషయంలో సిద్ధరామయ్య భయపడిపోయారని వ్యాఖ్యానించారు. బెంగళూరు నగర నిర్మాత కెంపెగౌడ జయంతి సందర్భంగా విధాన సౌధ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీకే శివకుమార్ మాట్లాడారు. బెంగళూరు అభివృద్ధికి కారణం కెంపెగౌడ దార్శనికత అని కొనియాడారు. అయితే 2017 లో సిద్ధరామయ్య ప్రభుత్వం వెనకడుగు వేయడంపై డీకే స్పందించారు. ఆయన వ్యాఖ్యలు పొలిటికల్ దుమారం రేపుతోంది. బసవేశ్వర నగర్ నుంచి హెబ్బల్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రాజెక్టును నిర్మించాలని 2017లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించింది.

ఈ నిర్ణయంపై స్థానికుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో ప్రభుత్వం వెనుకంజ వేసింది. దీనిపై తాజాగా స్పందించి డీకే శివకుమార్ ఈ విషయంలో అప్పటి సీఎం సిద్దరామయ్య, బెంగళూరు నగర అభివృద్ధి శాఖ మంత్రి కేజే జార్జ్ ఆందోళనలకు భయపడ్డారు. కానీ అదే నేనైతే నిరసనకారుల తాటాకు చప్పుళ్లకు భయపడేవాడిని కాదని అన్నారు. పరిస్థితులు ఎలా ఉన్నా ఫ్లై ఓవర్ నిర్మించి తీరేవాడినని చెప్పారు. కర్నాటకలో సిద్దరామయ్య, డీకే మధ్య అంతంత మాత్రంగానే సంబంధాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న వేళ ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

Advertisement

Next Story