చలో ఢిల్లీ : కళ్లు కోల్పోయిన 13 మంది.. కాళ్లు కోల్పోయిన 50 మంది.. చెవిటివాళ్లుగా మారిన 50 మంది రైతులు

by Hajipasha |   ( Updated:2024-02-16 14:21:37.0  )
చలో ఢిల్లీ : కళ్లు కోల్పోయిన 13 మంది.. కాళ్లు కోల్పోయిన 50 మంది.. చెవిటివాళ్లుగా మారిన 50 మంది రైతులు
X

దిశ, నేషనల్ బ్యూరో : దేశ రాజధాని సరిహద్దుల్లో రైతన్నల నిరసనలు శుక్రవారం (నాలుగో రోజు) కూడా కంటిన్యూ అయ్యాయి. పంజాబ్-హర్యానా శంభు సరిహద్దుల్లో రైతులను చెదరగొట్టడానికి భద్రతా దళాలు యత్నించాయి. ఈక్రమంలో అన్నదాతలపైకి టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించారు. రబ్బరు పెల్లెట్లను రైతులపైకి సంధించారు. పాటియాలా-అంబాలా సరిహద్దు, సంగ్రూర్-హిసార్ సరిహద్దులలోనూ ఇదేవిధమైన ఉద్రిక్తత ఏర్పడింది. పంజాబ్-హర్యానా బార్డర్‌ వద్ద జరిగిన నిరసనల్లో పాల్గొన్న పంజాబ్ రైతు 78 ఏళ్ల జ్ఞాన్ సింగ్‌ శుక్రవారం ఉదయం కన్నుమూశారు.

పెల్లెట్లు, రబ్బర్ బుల్లెట్లతో ఎటాక్..

ఇప్పటివరకు పెల్లెట్ గాయాల కారణంగా దాదాపు ముగ్గురు రైతులు కంటిచూపును కోల్పోయారని పంజాబ్ ఆరోగ్యశాఖ వెల్లడించింది. టియ‌ర్ గ్యాస్‌ను నిరంత‌రాయంగా రైతులకు విడిచి పెడుతుండ‌డంతో పూర్తిగా కళ్లు కోల్పోయిన వారి సంఖ్య 10కి పెరిగింది. సోనిక్ ఆయుధాలను భద్రతా బలగాలు వినియోగించడంతో భారీ శ‌బ్దాలు వెలువ‌డి.. ప‌దుల సంఖ్య‌లో రైతులు వినికిడి శ‌క్తిని కోల్పోయారు. దాదాపు 50 మందికి చెవుల్లోంచి ర‌క్తం కారి వినికిడి శ‌క్తి పోయింది. చెవి న‌రాలు చిట్లిపోయాయి. ర‌బ్బ‌ర్ బుల్లెట్లతో పోలీసులు జరిపిన కాల్పుల కార‌ణంగా కాళ్లు కోల్పోయిన వారి సంఖ్య కూడా 50 దాటింది.

రైతన్నల ఛక్కా జామ్..

ఢిల్లీ బార్డర్‌ను పోలీసులు సీల్ చేయడంతో దేశ రాజధానికి రోడ్డు మార్గంలో వెళ్లేవారు నానా తిప్ప‌లు ప‌డుతున్నారు. చాలా రాష్ట్రాల నుంచి వ‌చ్చే వారిని దాదాపు 150 కిలో మీట‌ర్ల దూరంలోని ర‌హ‌దారి మీదుగా దారి మ‌ళ్లించి ఢిల్లీలోకి పంపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇక శుక్రవారం నిర్వహించిన గ్రామీణ భారత్ బంద్‌ సందర్భంగా పంజాబ్‌లోని 240 ప్రదేశాలలో ఛక్కా జామ్ నిర్వహించారు.బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్‌, హర్యానాలలోని పలు రైతు సంఘాలు కూడా భారత్ బంద్‌లో పాల్గొన్నాయి. టోల్ ప్లాజాల వద్ద రైతులు నిరసనలు తెలిపారు. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. జాతీయ రహదారులను కూడా దిగ్బంధించారు. కశ్మీర్‌లోని లాల్ చౌక్ వద్ద నిరసన తెలుపుతున్న 50 మంది ట్రేడ్ యూనియన్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రైతులతో చర్చలపై కీలక అప్‌డేట్

‘చలో ఢిల్లీ’ కార్యక్రమంతో నిరసనకు దిగిన రైతు సంఘాల నాయకులతో గురువారం అర్ధరాత్రి చండీగఢ్‌లో నిర్వహించిన చర్చలు సానుకూల వాతావరణంలోనే ముగిశాయని కేంద్ర మంత్రి అర్జున్ ముండా వెల్లడించారు. ఇప్పటికే రైతులతో మూడు రౌండ్ల చర్చలు జరగగా.. నాలుగో విడత చర్చలు ఆదివారం సాయంత్రం 6 గంటలకు జరుగుతాయని తెలిపారు. ఈ సమావేశంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా పాల్గొన్నారని ఆయన చెప్పారు. గురువారం రాత్రి 8:45 గంటల నుంచి శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల వరకు రైతు నేతలు, కేంద్ర మంత్రుల భేటీ కొనసాగిందన్నారు. మరో విడత చర్చలు పూర్తయ్యే వరకు పంజాబ్, హర్యానా మధ్యనున్న రెండు సరిహద్దు పాయింట్ల వద్ద తాము ఆగి ఉంటామని కేంద్ర మంత్రులకు రైతు నాయకులు ఈ సమావేశం సందర్భంగా తెలిపారు.

హర్యానా పోలీసులను నిలువరించాలని చెప్పాను : సీఎం మాన్

రైతు నాయకులు, కేంద్రం ప్రభుత్వం మధ్య సవివరమైన చర్చ జరిగిందని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ చెప్పారు. ప్రతి అంశంపై, వివరణాత్మక చర్చ జరిగిందని.. అనేక అంశాలపై రైతులు, కేంద్ర సర్కారు మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని ఆయన పేర్కొన్నారు. సంగ్రూర్, పాటియాలా, ఫతేఘర్ సాహిబ్‌లలోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన అంశాన్ని తాను కేంద్రానికి తెలియజేశానన్నారు. పంజాబ్‌లోని ఆందోళనకారులపైకి టియర్ గ్యాస్ షెల్స్‌ను జారవిడిచేందుకు హర్యానా పోలీసులు డ్రోన్లను ఉపయోగించిన అంశాన్ని కూడా తాను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్లు పంజాబ్ సీఎం చెప్పారు.హర్యానా ప్రభుత్వంతో మాట్లాడి పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో శాంతిభద్రతలను కాపాడాలని కోరతామని కేంద్రం నుంచి హామీ లభించిందన్నారు. కాగా, రైతులతో చర్చలు జరుపుతున్న కేంద్ర మంత్రుల టీమ్‌లో వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా, వాణిజ్యం శాఖ మంత్రి పీయూష్ గోయల్, హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఉన్నారు.

Advertisement

Next Story