డేరా బాబా మహిమ.. మరో 50 రోజుల పెరోల్

by Hajipasha |
డేరా బాబా మహిమ.. మరో 50 రోజుల పెరోల్
X

దిశ, నేషనల్ బ్యూరో : డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు వరుసపెట్టి పెరోల్స్ మంజూరవుతున్నాయి. తాజాగా శుక్రవారం ఆయనకు 50 రోజుల పెరోల్‌ను మంజూరు చేశారు. వాస్తవానికి ఇద్దరు మహిళా శిష్యులపై అత్యాచారం చేసిన కేసులో గుర్మీత్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. హర్యానాలోని రోహ్‌తక్‌లో ఉన్న సునారియా జైలులో ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అంతకుముందు 2023 నవంబరు 21న గుర్మీత్‌కు 21 రోజుల పెరోల్ మంజూరైంది. ఈ లెక్కన గుర్మీత్ పెరోల్ గడువును ముగించుకొని జైలుకు తిరిగి వెళ్లిన నెలరోజుల్లోనే మరోసారి పెరోల్ వచ్చేసిందన్న మాట. పెరోల్ సమయంలో గుర్మీత్ రామ్ రహీమ్ ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో ఉన్న తన ఆశ్రమం ‘డేరా సచ్చా సౌదా’లో ఉంటున్నారు. 2023 సంవత్సరంలో మొత్తం మూడుసార్లు పెరోల్ రావడంతో.. ఆయన జైలు నుంచి బయటికొచ్చారు. గతేడాది జనవరిలో 40 రోజులు, జూలైలో 30 రోజులు, నవంబరులో 21 రోజుల పెరోల్ వచ్చింది. 2022 సంవత్సరంలో అక్టోబరులో 40 రోజులు, జూన్‌లో 30 రోజులు, ఫిబ్రవరిలో 21 రోజుల పెరోల్ వచ్చింది. డేరా చీఫ్‌కు హర్యానా ప్రభుత్వం పదేపదే పెరోల్ మంజూరు చేస్తుండటంపై శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ అధ్యక్షుడు హర్జిందర్ సింగ్ ధామి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యల వల్ల రాష్ట్ర సర్కారుపై సిక్కు సమాజానికి అపనమ్మకం కలుగుతోందని ఆయన పేర్కొన్నారు. ‘‘డేరా చీఫ్‌కు పదేపదే పెరోల్ ఇస్తున్నారు. జైలు నుంచి విడుదల చేస్తున్నారు. సిక్కు ఖైదీలకు ఈవిధంగా ఉదారంగా పెరోల్ ఇచ్చే విషయంపై మాత్రం ప్రభుత్వం స్పందించడం లేదు’’ అని హర్జిందర్ సింగ్ ధామి చెప్పారు. కాగా, 16 ఏళ్ల క్రితం ఒక జర్నలిస్టును హత్య చేసిన కేసులోనూ గుర్మీత్‌కు 2019లో శిక్ష పడింది.

Next Story

Most Viewed