Ballot Paper: ప్రజాస్వామ్యాన్ని టెక్నాలజీకి వదిలిపెట్టలేం

by Mahesh Kanagandla |
Ballot Paper: ప్రజాస్వామ్యాన్ని టెక్నాలజీకి వదిలిపెట్టలేం
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రజాస్వామ్యం(Democracy) చాలా విలువైందని, దాన్ని టెక్నాలజీకి వదిలిపెట్టలేమని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ(Congress MP Manish Tewari) బుధవారం అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఎన్నికల్లో ఈవీఎం(EVMs)ల నుంచి తిరిగి బ్యాలెట్ పేపర్లకు మళ్లాలని అభిప్రాయపడ్డారు. ఈవీఎంలు కనిపెట్టిన దేశాలు, ఇండియా కంటే ముందు వాటిని వినియోగించిన దేశాలు కూడా తిరిగి బ్యాలెట్ పేపర్‌(Ballot Paper)కు మళ్లాయని వివరించారు. ఎందుకంటే ప్రజాస్వా్మ్యం చాలా విలువైందని, దాన్ని సింపుల్‌గా టెక్నాలజీకి వదిలిపెట్టలేమని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకోవాలని, కేవలం పరిగణించడమే కాదు.. అటువైపుగా నిర్ణయాలు కూడా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈవీఎంల బ్యాటరీ లైఫ్‌ను ఆధారంగా చేసుకుని కాంగ్రెస్ ఆరోపణలను పరోక్షంగా ఆయన ప్రస్తావించారు. ఒక ఈవీఎంను ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లేదా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వినియోగించినా.. ఆ ఈవీఎం బ్యాటరీ లైఫ్ 99 శాతం ఉంటుందా? అని ప్రశ్నించారు. ఈవీఎం బ్యాటరీ డిశ్చార్జ్ అయ్యాక వాటిని స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరుస్తారని, రెండు మూడు రోజులకు వెలికి తీసి ఓట్లను లెక్కిస్తారని వివరించారు. హర్యానా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఆరోపణలు చేసిన తర్వాత ఎన్నికల సంఘం సీరియస్ అయింది. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలని, నిరాధారమైనవని కొట్టిపారేసింది. ఎలాంటి ఆధారాలు లేకున్నా గాలిమాటలు మాట్లాడవొద్దని హితవు పలికింది. ఈ నేపథ్యంలోనే మనీశ్ తివారీ రియాక్ట్ అయ్యారు.

Advertisement

Next Story