ఆర్టీఐ నుంచి సీబీఐకి పూర్తి మినహాయింపు లేదు.. హైకోర్టు కీలక ఆదేశం

by Hajipasha |
ఆర్టీఐ నుంచి సీబీఐకి పూర్తి మినహాయింపు లేదు.. హైకోర్టు కీలక ఆదేశం
X

దిశ, నేషనల్ బ్యూరో : సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ)కు సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) నుంచి పూర్తి మినహాయింపు లేదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. అవినీతి, మానవ హక్కుల ఉల్లంఘనలతో ముడిపడిన సమాచారాన్ని కోరుతూ దాఖలయ్యే ఆర్టీఐ దరఖాస్తులకు సీబీఐ స్పందించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. అయితే సున్నితమైన సమాచారంతో ముడిపడిన కేసుల వ్యవహారంలో మాత్రం సీబీఐ ఆచితూచి వ్యవహరించవచ్చని న్యాయస్థానం పేర్కొంది. ఢిల్లీ ఎయిమ్స్‌లోని జై ప్రకాష్ నారాయణ్ అపెక్స్ ట్రామా సెంటర్‌లో ఉన్న మెడికల్ స్టోర్ కోసం క్రిమిసంహారకాలు, దోమల నియంత్రణ సామగ్రి కొనుగోలులో గతంలో అవినీతి జరగడంతో సీబీఐ దర్యాప్తు చేసింది. ఈ అవినీతిని వెలుగులోకి తేవడంలో ఆనాటి ఎయిమ్స్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్‌, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి సంజీవ్ చతుర్వేది కీలక పాత్ర పోషించారు. దీనిపై సీబీఐ జరిపిన విచారణలో వెల్లడైన వివరాలను అందించాలంటూ తొలుత సంజీవ్ చతుర్వేది సీబీఐకి చెందిన సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (సీపీఐఓ)ను ఆశ్రయించారు. అయితే సమాచారాన్ని అందించేందుకు సీబీఐ నో చెప్పింది. దీంతో ఆయన సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (సీఐసీ)ని సంప్రదించగా.. సంజీవ్ చతుర్వేదికి నిర్దిష్ట సమాచారాన్ని అందించాలని సీబీఐని సీఐసీ 2019 నవంబరులో ఆదేశించింది. ఈ ఆర్డర్‌ను ఢిల్లీ హైకోర్టులో సీబీఐ సవాల్ చేయగా.. నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు దానికి సంబంధించిన తీర్పు వచ్చింది. ‘‘సంజీవ్ చతుర్వేది కోరిన సమాచారం సున్నితమైనదేం కాదు. దాన్ని ఆయనకు ఇవ్వండి. ఆర్టీఐ నుంచి సీబీఐకి పూర్తి మినహాయింపు లేదని గుర్తుంచుకోవాలి’’ అని తాజా ఆదేశంలో న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

Advertisement

Next Story