చిక్కుల్లో మహారాష్ట్ర మాజీ సీఎం.. ఆ కేసులో హైకోర్టు నోటీసులు

by Javid Pasha |
చిక్కుల్లో మహారాష్ట్ర మాజీ సీఎం.. ఆ కేసులో హైకోర్టు నోటీసులు
X

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన రెండో కూటమి నాయకుడు ఉద్ధవ్ థాక్రే చిక్కుల్లో పడ్డారు. పరువు నష్టం కేసులో ఢిల్లీ హైకోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు ఆయన కుమారుడు ఆదిత్య థాక్రే, సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ కు కూడా కోర్టు నోటీసులు పంపింది. ఈ కేసులో ఏప్రిల్ 17న కోర్టుకు హాజరు కావాలంటూ ఆదేశించింది. ఇక ఈ నోటీసులకు సంబంధించిన విషయానికొస్తే.. శివసేన పార్టీ, ఆ పార్టీకి చెందిన బాణం, ఈటె సింబల్ ను మహారాష్ట్ర సీఎం షిండే ( శివసేన రెబల్) వర్గానికి కేటాయిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఎన్నికల సంఘం నిర్ణయాన్ని అప్పటి శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే, ఆయన తనయుడు ఆదిత్య థాక్రే, పార్టీ సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ తప్పుబట్టారు. రూ.2000 కోట్లు వెచ్చించి షిండే వర్గం నాయకులు శివసేన పార్టీని, పార్టీ గుర్తును కొనుగోలు చేశారని ఆరోపించారు.

అయితే ఉద్ధవ్ థాక్రే ఆరోపణలను సవాల్ చేస్తూ షిండే వర్గానికి చెందిన ఎంపీ రాహుల్ రమేశ్ షెవాలె హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ క్రమంలోనే హైకోర్టు ఉద్ధవ్ తో పాటు ఆయన కుమారుడు ఆదిత్య థాక్రే, సంజయ్ రౌత్ లకు సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 17న ఈ కేసు విచారణకు రానుంది. కాగా మోడీ ఇంటిపేరు వ్యవహారంలోని ఓ పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి రెండేళ్ల శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ శిక్ష ఖరారైన నేపథ్యంలో రాహుల్ ఆయన ఎంపీ పదవిని కూడా కోల్పోయారు. తాజాగా ఉద్ధవ్ థాక్రే, ఆదిత్య థాక్రే, సంజయ్ రౌత్ లపై నమోదైన పరువు నష్టం కేసు విచారణకు రానుండటంతో ఏం జరుగుతుందోననే ఆసక్తి నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed