ఉమర్ ఖలీద్‌కు షాక్..బెయిల్ పిటిషన్ తిరస్కరించిన ఢిల్లీ కోర్టు

by vinod kumar |
ఉమర్ ఖలీద్‌కు షాక్..బెయిల్ పిటిషన్ తిరస్కరించిన ఢిల్లీ కోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: 2020 ఢిల్లీ అల్లర్లతో ముడిపడి ఉన్న కుట్ర కేసులో జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థి నేత ఉమర్ ఖలీద్ బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీలోని కర్కర్దూమా కోర్టు తిరస్కరించింది. అదనపు సెషన్స్ జడ్జి సమీర్ బాజ్‌పాయ్ ఖలీద్ పిటిషన్‌ను తోసిపుచ్చారు. ఉపా కేసులో అరెస్టైన ఉమర్ రెగ్యులర్‌ బెయిల్‌ ఇవ్వాలని కోరారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం మే 13న బెయిల్ దరఖాస్తుపై ఉత్తర్వులను రిజర్వ్ చేసి..తాజాగా తిరస్కరిస్తున్నట్టు తెలిపింది. కాగా, ఖలీద్ 23 చోట్ల నిరసనలకు ప్లాన్ చేశారని, ఇది అల్లర్లకు దారితీసిందని పోలీసులు ఆరోపించారు. దీంతో ఆయనపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా), నేరపూరిత కుట్ర, అల్లర్లు అనేక ఇతర నేరాలకు సంబంధించిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలోనే 2020లో ఉమర్‌ను అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉండగా..2022లో ట్రయల్ కోర్టు బెయిల్‌ను నిరాకరించింది. అనంతరం హైకోర్టును ఆశ్రయించినప్పటికీ ఊరట లభించలేదు. దీంతో అత్యున్నత న్యాయస్థానంలో అప్పీలు చేయగా..ఢిల్లీ పోలీసుల ప్రతిస్పందనను తెలియజేయాలని ఆదేశించింది. అయితే పలు కారణాల వల్ల ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా తిరస్కరించింది.

Advertisement

Next Story

Most Viewed