ఢిల్లీ విమానాశ్రయం టెర్మినల్-1 పైకప్పు కూలిన ఘటన.. టాప్ పాయింట్స్

by Hajipasha |
ఢిల్లీ విమానాశ్రయం టెర్మినల్-1 పైకప్పు కూలిన ఘటన.. టాప్ పాయింట్స్
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అపశృతి చోటుచేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో విమానాశ్రయం టెర్మినల్-1లోని పైకప్పులో కొంతభాగం కుప్పకూలింది. పైకప్పు భాగం నేరుగా ట్యాక్సీలు, పలు కార్లపై పడటంతో ఒకరు మృతిచెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు. గాయపడిన వారికి ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. ఈ ఘటనలో నాలుగు వాహనాలు దెబ్బతిన్నాయి. దీంతో టెర్మినల్‌-1 నుంచి బయలుదేరే అన్ని విమాన సర్వీసులను నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు ఢిల్లీ ఎయిర్ పోర్టు నిర్వాహక సంస్థ ‘డీఐఏఎల్’ ప్రకటించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామని, అది త్వరలోనే విచారణ నివేదికను అందిస్తుందని వెల్లడించింది. గురువారం అర్ధరాత్రి నుంచి ఢిల్లీలో కురుస్తున్న కుండపోత వర్షం వల్లే ఇలా జరిగి ఉంటుందనే ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలిపింది. టెర్మినల్-1 పైకప్పు కూలిన ఘటనలో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం అందిస్తామని ‘డీఐఏఎల్’ పేర్కొంది. గాయాలపాలైన వారికి రూ.3 లక్షలు చొప్పున సాయం అందజేస్తామని చెప్పింది.

డీజీసీఏ కీలక ఆదేశాలు

‘‘ఎయిర్‌పోర్టులోని టెర్మినల్-1 నుంచి కేవలం దేశీయ విమాన సర్వీసులు నడుస్తుంటాయి. టెర్మినల్-1 అందుబాటులోకి వచ్చే వరకు ఆయా విమాన సర్వీసులను టెర్మినల్ -2, టెర్మినల్ -3 నుంచి నడుపుతాం’’ అని డీఐఏఎల్ పేర్కొంది. ఈ ఘటన నేపథ్యంలో ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించాల్సిన ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. వారు ప్రయాణించాల్సిన విమానాల గురించిన సమాచారం అందక గందరగోళానికి గురయ్యారు. ఈ క్రమంలో విమానాశ్రయాల భద్రత, తనిఖీలను పర్యవేక్షించే సంస్థ ‘డీజీసీఏ’ విమానయాన సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యామ్నాయ విమాన సర్వీసులను నడపాలని, విమానాలు రద్దయితే ప్రయాణికులకు వెంటనే టికెట్ల డబ్బులను రీఫండ్ చేయాలని నిర్దేశించింది.

టెర్మినల్ -1‌ మోడీ హయాంలో కట్టింది కాదు : రామ్మోహన్‌ నాయుడు

ఢిల్లీ ఎయిర్ ‌పోర్టులోని సంఘటనా స్థలాన్ని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు స్వయంగా వెళ్లి పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘టెర్మినల్ -1 అనేది ఢిల్లీ ఎయిర్‌ పోర్టులోని పాత భవనంలో ఓ భాగం. దాన్ని 2009 సంవత్సరంలో ప్రారంభించారు. ప్రధాని మోడీ ప్రారంభించిన ఎయిర్ పోర్టు నూతన భవనం అవతలివైపు ఉంది’’ అని వెల్లడించారు. పైకప్పు కూలిన భాగంలోని కొన్ని బీమ్‌లు తుప్పుపట్టి ఉన్నాయని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘దీని గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు చర్య అవుతుంది.తనిఖీ చేయమని విమానాశ్రయ అధికారులను ఆదేశించాం. మంత్రిత్వ శాఖ, డీజీసీఏ విడివిడిగా దర్యాప్తు చేస్తాయి’’ అని రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. ఇకపై ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు దేశంలోని అన్ని విమానాశ్రయాల నిర్మాణాలను తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ఆయా ఎయిర్‌పోర్టుల భవనాల స్థితిగతుల వివరాలతో నివేదికను తయారు చేస్తామని, ఇందుకోసం అవసరమైతే ప్రత్యేకంగా ఒక స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు. డీజీసీఏ కూడా మరో నివేదికను సిద్ధం చేస్తుందని మంత్రి వివరించారు.

మోడీ హయాంలో అన్నీ నాసిరకం నిర్మాణాలే : ఖర్గే

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రమాదం జరిగిన టెర్మినల్-1 భవనాన్ని ప్రధాని మోడీయే ప్రారంభించారని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. మోడీ పాలనలో ఇలాంటి నాసిరకం మౌలిక సదుపాయాల నిర్మాణాలే జరిగాయన్నారు. అవినీతి జరిగినందు వల్లే ఆయా నిర్మాణాల్లో నాణ్యత లోపించిందని మండిపడ్డారు. ఎయిర్ పోర్టు ఘటనలో చనిపోయి వ్యక్తి కుటుంబానికి ఖర్గే సంతాపం తెలిపారు. ‘‘ఢిల్లీ విమానాశ్రయం పైకప్పు కూలిపోవడం, జబల్‌పూర్ విమానాశ్రయం పైకప్పు కూలిపోవడం, అయోధ్య కొత్త రోడ్ల దుస్థితి, రామమందిరంలో లీకేజీలు, ముంబయి ట్రాన్స్ హార్బర్ లింక్ రోడ్డులో పగుళ్లు, 2023 నుంచి 2024 మధ్య బీహార్‌లో 13 కొత్త వంతెనలు కూలిపోవడం, ప్రగతి మైదాన్ టన్నెల్ మునిగిపోవడం, గుజరాత్‌లో మోర్బీ వంతెన కూలడం వంటివి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల సృష్టించామని మోడీ జీ చెప్పుకున్న గొప్పలలో దాగిన వాస్తవాలు’’ అని ఖర్గే ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story

Most Viewed