Cyclone Chido: చిడో తుపాన్ ప్రభావం.. ఫ్రాన్స్‌లో 22 మంది మృతి

by vinod kumar |
Cyclone Chido: చిడో తుపాన్ ప్రభావం.. ఫ్రాన్స్‌లో 22 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఫ్రాన్స్‌లోని మయోట్ (Mayyott) ద్వీపంలో చిడో తుపాన్ (Cyclone) బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే దీని ప్రభావం వల్ల ఇప్పటి వరకు 22 మంది ప్రాణాలు కోల్పోగా, 1400 మందికి పైగా గాయపడ్డట్టు అధికారికంగా ధ్రువీకరించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక మేయర్ అంబిల్‌వాహెడౌ సౌమైలా తెలిపారు. కరెంటు సరఫరాలో అంతరాయంతో పాటు ప్రజలు ఆహారం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఫ్రెంచ్ అంతర్గత మంత్రి బ్రూనో రిటైల్లేయు (Brunio Retylleyu) మాట్లాడుతూ.. ఈ విపత్తు 70శాతం నివాసితులను ప్రభావితం చేసిందని, భూభాగం ధ్వంసమైందని ఆవేదన వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని ఇప్పటికే విధుల్లో ఉన్న 1,600 మంది సిబ్బందికి సహాయం చేయడానికి 400 మంది అదనపు పారామిలటరీ సిబ్బందిని మోహరించినట్లు ప్రకటించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ పరిస్థితిపై సమీక్షించారు. త్వరలోనే ఆయన మయోటాను సందర్శించనున్నట్టు తెలుస్తోంది.

ఫ్రాన్స్‌కు అండగా ఉంటాం: ప్రధాని మోడీ

మయోటాలో జరిగిన విధ్వంసంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) విచారం వ్యక్తం చేశారు. ఆ ప్రాంత ప్రజలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘మయోటాలో చిడో తుపాను సృష్టించిన విధ్వంసం పట్ల నేను చాలా బాధపడ్డా. నా ఆలోచనలు, ప్రార్థనలు బాధితుల కుటుంబాలతో ఉన్నాయి. ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నాయకత్వంలో ఈ విషాదాన్ని ఫ్రాన్స్ దృఢసంకల్పంతో అధిగమిస్తుందని విశ్వసిస్తున్నా. భారతదేశం ఫ్రాన్స్‌కు సంఘీభావంగా నిలుస్తుంది. సాధ్యమైన సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది’ అని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed