Artificial Intelligence: ఏఐ దెబ్బకు ఫోన్ పే ఉద్యోగుల్లో కోత

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-22 06:21:18.0  )
Artificial Intelligence: ఏఐ దెబ్బకు ఫోన్ పే ఉద్యోగుల్లో కోత
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచ వ్యాప్తంగా కృత్రిమమేధ(ఏఐ) సాంకేతికత దెబ్బకు పలు పరిశ్రమల ఉద్యోగుల్లో కోత పడుతున్న సంఘటనలు ఉద్యోగులను, నిరుద్యోగులను కలవరపెడుతున్నాయి. ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ ఫోన్ పే కస్టమర్ సపోర్టు స్టాఫ్ పై ఏఐ ఎఫెక్టు పడింది. గడిచిన ఐదేళ్లలో 1,100మంది(60శాతం) ఉద్యోగాలను ఫోన్ పే తొలగించింది. ఏఐ ఆధారిత చాట్ బోట్ల ద్వారా ఆటోమేటెడ్ కస్టమర్ సర్వీసులతో సమర్ధత పెరిగిందని ఫోన్ పే అక్టోబర్ 21న విడుదల చేసిన తన నివేదికలో పేర్కొంది. సంస్థ సపోర్టింగ్ స్టాఫ్ 1100 మంది ఏజెంట్ల నుంచి 400 మందికి పడిపోయిందని ఫోన్‌పే వార్షిక నివేదికలో తెలిపింది. గత ఐదేళ్లలో కస్టమర్ సపోర్ట్ విభాగంలో 90 శాతం ఏఐ చాట్ ను వినియోగిస్తున్నారు.

కంపనీ అభివృద్ధి చర్యల్లో భాగంగా నష్టాలను తగ్గించుకుంటూ ఆదాయం పెంచుకుంటోంది. ఏఐ పవర్డ్ సొల్యూషన్స్ దిశగా అడుగులేస్తున్న ఫోన్‌పే లావాదేవీలు 2018-19 నుంచి 2023-24 మధ్య 40 రెట్లు పెరిగాయి. 2022 - 23ఆర్థిక సంవత్సరంలో రూ.3,085కోట్లుగా ఉన్న ఆదాయం 2023 - 24లో రూ.5725కోట్లకు చేరుకుందని నివేదించింది. ఇందులో 10 శాతం డిజిటల్ పేమెంట్ సబ్సిడీ రూపంలో ప్రభుత్వం నుంచి ఆదాయం వచ్చిందని తెలిపింది.

ఏఐ వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోనున్నారని కొందరు నిపుణులు భావిస్తున్నారు. కస్టమర్ సర్వీస్ విభాగంలో ఇలా ఉద్యోగాలు కోల్పోయే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. అయితే ఏఐకి శిక్షణ ఇచ్చే విభాగంలో సరైన నైపుణ్యాలు కలిగిన ఉద్యోగుల కొరత ఉందని, ఇప్పటికే సర్వీస్ విభాగంలో పని చేస్తున్నవారు నిరాశ పడకుండా తమ రంగంలో ఏఐకు శిక్షణ ఇచ్చే నైపుణ్యాలు నేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed