Sitaram Yechury: హైదరాబాద్‌లో బాల్యం.. ఢిల్లీలో రాజకీయ ప్రస్థానం

by Harish |
Sitaram Yechury: హైదరాబాద్‌లో బాల్యం.. ఢిల్లీలో రాజకీయ ప్రస్థానం
X

దిశ, నేషనల్ బ్యూరో: గత కొన్ని రోజులుగా ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ప్రముఖ రాజకీయ వేత్త సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(72 ఏళ్లు) గురువారం కన్నుమూశారు. ఆగస్టు 19న ఎయిమ్స్‌లో జాయిన్ కాగా వెంటిలేటర్ పైన ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితి విషమించడంతో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు చనిపోయినట్లు వైద్యులు ఒక ప్రకటనలో తెలిపారు. టీచింగ్, రీసెర్చ్ ప్రయోజనాల కోసం సీతారాం ఏచూరి కుటుంబ సభ్యులు ఆయన మృతదేహాన్ని ఆసుపత్రికి దానం చేశారని ఎయిమ్స్ తెలిపింది. భారత రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తిగా ఉన్న ఏచూరి మృతితో పార్టీతో పాటు అభిమానుల్లో తీవ్ర విషాదం నెలకొంది. సీతారాం మొదటి భార్య ఇంద్రాణి మజుందార్‌. జర్నలిస్ట్ సీమా చిశ్తీని రెండో వివాహం చేసుకున్నారు. ఆయనకు ముగ్గురు సంతానం.

ఏచూరి 1952 ఆగస్టు 12న చెన్నైలోని తెలుగు కుటుంబంలో జన్మించారు. ఆయన బాల్యం అంతా కూడా హైదరాబాద్‌లోనే గడిచింది. పదో తరగతి వరకు ఆల్ సెయింట్స్ హైస్కూల్లో చదివారు. తర్వాత నిజాం కాలేజీలో చదువును మధ్యలోనే వదిలేసి ఢిల్లీకి మారారు, అక్కడ 1970లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్(CBSE) 12వ తరగతి పరీక్షలో ఆలో ఇండియా ప్రథమ ర్యాంకు సాధించారు. విద్యార్థిగా ఉన్న దశలోనే ఉద్యమాలలో చురుగ్గా పాల్గొన్నారు.

జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU)లో ఉన్న సమయంలో 1974లో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI)లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. కీలక వ్యక్తిగా ఎదిగి, యూనియన్‌కు మూడుసార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1975లో CPIMలో చేరారు. పౌర స్వేచ్ఛ, వామపక్ష భావజాలం కోసం గట్టిగా పోరాడారు. ఎమర్జెన్సీ సమయంలో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. అప్పుడే ఇతర నాయకులతో పాటు ఆయన కూడా అరెస్ట్ అయ్యారు. దీంతో ఆయన Phd మధ్యలోనే ఆగిపోయింది.

1984లో ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్షుడిగా ఉండి సీపీఐ(ఎం) కేంద్ర కమిటీలో చేరారు. 1986లో ఎస్‌ఎఫ్‌ఐ నుంచి వైదొలిగి పార్టీ సెంట్రల్ సెక్రటేరియట్‌కు ఎన్నికయ్యారు. తరువాత 1992లో పొలిట్‌బ్యూరో సభ్యునిగా ఎన్నికయ్యారు. 2015లో ప్రకాష్ కారత్ తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2018 రెండోసారి, 2022లో మూడోసారి ఆ స్థానానికి తిరిగి ఎన్నికయ్యారు. 2005 నుండి 2017 వరకు పశ్చిమ బెంగాల్ నుండి పార్లమెంట్ రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు.

Advertisement

Next Story