'లడఖ్‌ నుంచి చైనా ఆర్మీ వెళ్లిపోతుందా?'.. ట్విట్టర్‌లో జైరాం రమేష్ సెటైర్

by Vinod kumar |
లడఖ్‌ నుంచి చైనా ఆర్మీ వెళ్లిపోతుందా?.. ట్విట్టర్‌లో జైరాం రమేష్ సెటైర్
X

న్యూఢిల్లీ : గత ఏడాది ఇండోనేషియాలోని బాలిలో జరిగిన జీ20 సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ మధ్య జరిగిన సంభాషణ వివరాలను కేంద్ర విదేశాంగ శాఖ తాజాగా వెల్లడించింది. ఆ సమయంలో జరిగిన విందు కార్యక్రమంలో.. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకతపై వారిద్దరూ మాట్లాడుకున్నారని పేర్కొంది. "భారత్‌-చైనా సరిహద్దు వద్ద పశ్చిమ సెక్టార్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న సమస్యను పరిష్కరించడం కీలకం. ఇదే రెండు దేశాల మధ్య ప్రతిష్టంభనను పరిష్కరించేందుకు దోహదం చేస్తుంది" అని జిన్‌పింగ్, మోడీ ఆనాడు అభిప్రాయపడ్డారని భారత విదేశాంగ శాఖ తెలిపింది.

దీనిపై స్పందించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్.. "రెండు దేశాల నేతలు స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు జరుపుకొని ఉండి ఉంటే.. లడఖ్‌లోని డెప్‌సాంగ్, డెమ్‌చోక్ నుంచి చైనా తన సైన్యాన్ని ఉపసంహరించుకుంటుందా?" అని ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నించారు. చైనా ఆక్రమణలకు క్లీన్ చిట్ ఇచ్చేలా విదేశాంగ శాఖ ప్రకటన ఉందన్నారు. "ప్రధాని మోడీ చైనా పై కన్నెర్ర చేస్తే జరిగేది ఇదే" అని సెటైర్ వేశారు.

Advertisement

Next Story