‘సీడబ్ల్యూసీ’ పాలస్తీనా అనుకూల తీర్మానంపై అస్సాం సీఎం ఆగ్రహం

by Vinod kumar |
‘సీడబ్ల్యూసీ’ పాలస్తీనా అనుకూల తీర్మానంపై అస్సాం సీఎం ఆగ్రహం
X

గౌహతి : పాలస్తీనాకు మద్దతు ఇస్తూ ఇటీవల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) చేసిన తీర్మానంపై అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ మండిపడ్డారు. కాంగ్రెస్ చేసిన ఈ ప్రకటన పాకిస్తాన్, తాలిబాన్ ప్రకటనల్ని పోలి ఉందంటూ ట్విట్టర్ వేదికగా కామెంట్ చేశారు. ‘‘కాంగ్రెస్ పార్టీ చేసిన తీర్మానంలో 3 పోలికలు ఉన్నాయి. మొదటిది .. హమాస్‌ ను ఖండించలేదు. రెండోది.. ఇజ్రాయెల్ పై దాడుల్ని ఖండించలేదు. మూడోది.. బందీలుగా ఉన్న మహిళలు, పిల్లల భద్రతపై మౌనం వహించారు’’ అని అస్సాం సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.

బుజ్జగింపు రాజకీయాల కోసం దేశ ప్రయోజనాలను పణంగా పెట్టే కల్చర్ కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉందని ఆయన ఆరోపించారు. దీనిపై లోక్‌సభలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్ స్పందించారు. ‘‘మాజీ ప్రధాని, దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి కూడా గతంలో పాలస్తీనాకు అనుకూలంగా వైఖరిని తీసుకున్నారు. బీజేపీ తన చరిత్రను తానే మర్చిపోయింది. పాలస్తీనాకు అనుకూలంగా తీర్మానం చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు వచ్చాయనే వార్తలు సరికావు’’ అని ఆయన స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సక్సెస్ అయినప్పటి నుంచి బీజేపీ కేవలం కాంగ్రెస్ గురించే మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story