బంగారంపై కస్టమ్స్ పన్ను తగ్గించడం వెనుక లాజిక్ ఏంటి?- జైరాం రమేశ్

by Shamantha N |
బంగారంపై కస్టమ్స్ పన్ను తగ్గించడం వెనుక లాజిక్ ఏంటి?- జైరాం రమేశ్
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగారంపై కస్టమ్స్‌ పన్ను తగ్గింపుల గురించి కేంద్రానికి కాంగ్రెస్ ప్రశ్నల వర్షం కురిపించింది. ఇటీవలే బంగారంపై కస్టమ్స్ పన్నుని తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే, బంగారంపై సుంకాన్ని దాదాపు సగానికి పైగా తగ్గించడం వెనుక లాజిక్ ఏంటని ప్రశ్నించింది. పసిడిపై సుంకాన్ని తగ్గించడంతో దిగుమతులను కనిపెట్టాల్సి ఉంటుందని కోటక్ మహీంద్రా ఏఎంసీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో నీలేష్ షా వ్యాఖ్యానించారు. కాగా.. ఈ కామెంట్లపై కాంగ్రెస్ కార్యదర్శి జైరాం రమేశ్ స్పందించారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ‘‘ఆర్థిక రంగంలో నీలేశ్‌ షాకు పేరుంది. ప్రధాన మంత్రి ఎనకమిక్‌ అడ్వైజరీ కౌన్సిల్‌ సభ్యుడు కూడా. అందరిలా కాకుండా ఆయన కేవలం ఆర్థిక విషయాలు, ఆర్థిక వ్యవస్థ గురించే మాట్లాడతారు. బంగారం దిగుమతులపై నీలేశ్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది’’ అని జైరాం రమేశ్‌ అన్నారు.

గతేడాది 3.8 లక్షల కోట్ల బంగారం దిగుమతి

2023-24లో 45.5 బిలియన్ డాలర్ల (3.8 లక్షల కోట్ల) విలువైన బంగారం దేశంలోకి దిగుమతి అయ్యిందన్నారు. అంటే, గతేడాదితో పోలిస్తే 30 శాతం పెరిగిందన్నారు. బంగారం దిగుమతులు పెరగడం వల్ల ఆర్థిక వృద్ధికి చేకూరే ప్రయోజనం చాలా తక్కువ అని అన్నారు. అయినప్పటికీ బంగారంపై దిగుమతి సుంకాన్ని 10 నుంచి 6 శాతానికి తగ్గించారన్నారు. బంగారంపై మొత్తం పన్నులు జీఎస్టీతో సహీ 18.5 శాతం నుంచి 9 శాతానికి తగ్గాయి. దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటి? అంటూ ప్రభుత్వాన్ని రమేశ్‌ నిలదీశారు. కాగా.. ఏటా 700 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నామని, పన్ను తగ్గింపు వల్ల ఈ బిల్లు మరింత పెరుగుతుందని కేంద్రమంత్రి ఓ ఇంటర్వ్యూలో అన్నారని నీలేశ్ షా అన్నారు. అలాగైతే బంగారం దిగుమతుల బిల్లు చమురు బిల్లును మించిపోయే అవకాశం ఉందన్నారు. దీనిపైనే జైరాం రమేశ్ ఈ విధంగా స్పందించారు.



Next Story

Most Viewed