ఎంఎస్పీకి చట్టబద్ధత.. 2024 కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో కీలకాంశాలు

by Hajipasha |
ఎంఎస్పీకి చట్టబద్ధత..  2024 కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో కీలకాంశాలు
X

దిశ, నేషనల్ బ్యూరో : 2024 లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తుది మెరుగులు దిద్దుకుంటోంది. తుది దశలో ఉన్న ఎన్నికల మేనిఫెస్టో ముసాయిదాపై చర్చించేందుకు మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం నేతృత్వంలోని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సోమవారం (ఈనెల 4న) సమావేశం కానుంది. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై చట్టం చేయడం, దేశవ్యాప్తంగా కుల గణన నిర్వహణ, ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ అనే అంశాలు హస్తం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ముసాయిదాలో ఉన్నాయని తెలుస్తోంది. భారత్ జోడో న్యాయ్ యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పదేపదే చెబుతున్న ‘పాంచ్ న్యాయ్’ (ఐదు న్యాయ స్తంభాలు)లకు మేనిఫెస్టోలో పెద్దపీట వేశారు. యువత, మహిళలు, రైతులు, కార్మికులు, అందరి భాగస్వామ్యం అనే ఐదు అంశాలు పాంచ్ న్యాయ్‌లో ఉంటాయని సమాచారం. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై చట్టం చేస్తామనే హామీపై కాంగ్రెస్ పార్టీ రైతు వర్గాల్లో పెద్దఎత్తున ప్రచారం చేయాలని భావిస్తోంది. వ్యవసాయ మార్కెట్లు కేంద్రంగా ఈ ప్రచారం ఉంటుందని అంటున్నారు. దేశంలోనే తొలిసారి కులగణన చేయించిన బిహార్ సీఎం నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమిలోకి జంప్ చేయడం కాంగ్రెస్‌కు హిందీ బెల్ట్‌లో కొంత నెగెటివ్‌గా మారుతుందని అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ తాము గెలిస్తే దేశవ్యాప్తంగా కులగణన తప్పక నిర్వహిస్తామని బలమైన సంకల్పాన్ని ప్రజల ఎదుట వ్యక్తపర్చాలని హస్తం పార్టీ నిర్ణయించుకుంది. యువత కోసం ఉద్యోగాల భర్తీ, కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేసే అంశాలను మేనిఫెస్టోలో హస్తం పార్టీ పొందుపర్చనుంది.

Advertisement

Next Story

Most Viewed