అవినీతిపరుల్ని తలకిందులుగా వేలాడదీస్తాం : అమిత్ షా

by Vinod kumar |
అవినీతిపరుల్ని తలకిందులుగా వేలాడదీస్తాం : అమిత్ షా
X

రాయ్ పూర్ : ఛత్తీస్‌గఢ్‌లో తాము అధికారంలోకి వస్తే అవినీతిపరుల్ని తలకిందులుగా వేలాడదీస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెచ్చరించారు. బీజేపీని గెలిపిస్తే.. అధికార కాంగ్రెస్ పార్టీ లూటీ చేసిన ప్రతీ పైసాను తిరిగి వసూలు చేస్తామని పేర్కొన్నారు. ఒకవేళ కాంగ్రెస్ మళ్లీ గెలిస్తే రాష్ట్రంలో బుజ్జగింపు రాజకీయాలు మునుపటిలాగే కొనసాగుతాయని చెప్పారు. ఛత్తీస్ గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌లో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. ‘‘రెస్టారెంట్ల బ్రాంచీలు వివిధ నగరాల్లో ఎలా ఉన్నాయో.. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తన అవినీతి గొలుసులను గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఏర్పాటు చేసుకుంది. మేం గెలిస్తే ఆ గొలుసులను తెంపేస్తాం’’ అని ఆయన ప్రకటించారు. ‘‘రూ.2000 కోట్ల విలువైన మద్యం కుంభకోణం, రూ.500 కోట్ల విలువైన బొగ్గు కుంభకోణం గత ఐదేళ్ల కాంగ్రెస్ పాలనలోనే జరిగాయి. చివరకు సీఎం బఘేల్ ఆఫీసులో పనిచేసే అధికారులు కూడా ఈ స్కాంలలో ఉన్నారు.

ప్రధానమంత్రి అన్న యోజనలోనూ కాంగ్రెస్ సర్కారు స్కాం చేసింది. రూ.5000 కోట్ల విలువైన గేమింగ్, బెట్టింగ్ యాప్ కుంభకోణం చేసింది’’ అని కేంద్ర హోం మంత్రి ఆరోపణలు గుప్పించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో రాష్ట్రంలోని బీరాన్‌పూర్‌లో చెలరేగిన మత హింసకు సీఎం భూపేష్ బఘెల్ సర్కారు వైఫల్యమే కారణమని ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్‌ను మతపరమైన అల్లర్లతో అట్టుడికే రాష్ట్రంగా మార్చాలనుకుంటున్నారా అని సభకు హాజరైన ప్రజలను అమిత్ షా ప్రశ్నించారు. రాజ్‌నంద్‌గావ్‌లో మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌తో పాటు మరో ముగ్గురు బీజేపీ అభ్యర్థుల నామినేషన్‌ పత్రాల దాఖలు సందర్భంగా ఈ సభను నిర్వహించారు. కాగా, బీరాన్‌పూర్ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన భునేశ్వర్ సాహు తండ్రి ఈశ్వర్ సాహును సాజా అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బీజేపీ బరిలోకి దింపింది.

Advertisement

Next Story

Most Viewed