అవినీతి, దోపిడీయే జేఎంఎం, కాంగ్రెస్ లక్ష్యం : మోడీ

by Hajipasha |
అవినీతి, దోపిడీయే జేఎంఎం, కాంగ్రెస్ లక్ష్యం : మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో : జార్ఖండ్‌లోని జేఎంఎం, కాంగ్రెస్ సంకీర్ణ సర్కారు అవినీతి, దోపిడీయే లక్ష్యంగా ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆరోపించారు. వాళ్లకు పేదలు, గిరిజనులు, ఆదివాసీల గోడు పట్టదన్నారు. ‘‘ఐటీ శాఖ దాడులు చేస్తే జార్ఖండ్‌కు చెందిన ఓ కాంగ్రెస్ ఎంపీ దగ్గర రూ.300 కోట్లు దొరికాయి. ఆ డబ్బంతా ఎవరిది ? మీదే.. జార్ఖండ్‌లోని పేదలు, రైతులు, కార్మికులు, దళితులు, గిరిజనులు, ఆదివాసీల నుంచి దోచుకున్న డబ్బే అది. దాన్ని తిరిగి కక్కించిన ఘనత మా ప్రభుత్వానిదే’’ అని మోడీ వ్యాఖ్యానించారు. ప్రజా సంక్షేమం ముసుగులో ప్రజల సంపదను దోచుకోవడమే కాంగ్రెస్, దాని మిత్రపక్షాల ఏకైక ఎజెండా అని ఆయన పేర్కొన్నారు. ‘‘కాంగ్రెస్, జేఎంఎం నేతలు కుంభకోణాలలో చిక్కుకున్నారు. అవినీతి ఊబిలో మునిగారు. మళ్లీ వాళ్లు ఏ మొహం పెట్టుకొని మీ దగ్గరికి వస్తున్నారు ? జార్ఖండ్‌లో విచ్చలవిడిగా దోపిడీకి తెగబడిన ఆ దగాకోర్లు.. ఢిల్లీలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నాన్ స్టాప్‌గా దేశ సంపదను స్వాహా చేయాలని స్కెచ్ గీస్తున్నారు. 2014కు ముందు వాళ్లు చేసింది కూడా అదే’’ అని మోడీ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలకు దేశ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ఎజెండాలే ముఖ్యమన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాళ్లు ఎంతకైనా దిగజారుతారని విమర్శించారు. జార్ఖండ్‌లోని సింగ్‌భమ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story