ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

by S Gopi |
ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల దగ్గరపడుతున్న నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 29 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఇది రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద ఎదురుకాల్పుల ఘటన ఇదే కావడం గమనార్హం. మావోయిస్టులపై ఆపరేషన్‌ను విజయవంతం చేసినందుకు భద్రతా బలగాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ప్రశంసించారు. దేశ అభివృద్ధి, శాంతి భద్రతలు, యువత భవిష్యత్తుకు నక్సలిజం శత్రువని అమిత్ షా అభిప్రాయపడ్డారు. ప్రధాని మోడీ నేతృత్వంలో దేశాన్ని నక్సలిజం నుంచి విముక్తి కల్పించాలనే లక్ష్యం కలిగి ఉన్నట్టు షా తెలిపారు. ప్రస్తుతం ఈ భావజాలం కొంత ప్రాంతానికే పరిమితం అయింది. త్వరలో ఛత్తీస్‌గఢ్‌తో పాటు దేశవ్యాప్తంగా నక్సల్స్ లేకుండా మార్చనున్నాం. గాయపడిన సిబ్బంది త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు ఎక్స్‌లో అమిత్ షా ట్వీట్ చేశారు. కాగా, మంగళవారం కాంకేర్ జిల్లాలోని హపటోవా అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులకు, భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో మొత్తం 29 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో కీలక నేత శంకర్‌రావు కూడా ఉన్నారు. ఈ ఏడాదిలోనే బస్తర్ ప్రాంతంలో వేర్వేరు ఘటనల్లో మొత్తం 79 మంది మావోయిస్టులు మృతిచెందారు.

Advertisement

Next Story