కోల్‌కతాలోని ఇస్కాన్ రథయాత్రలో రథాన్ని లాగిన సీఎం మమతా బెనర్జీ

by S Gopi |
కోల్‌కతాలోని ఇస్కాన్ రథయాత్రలో రథాన్ని లాగిన సీఎం మమతా బెనర్జీ
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదివారం జగన్నాధ రథయాత్ర ఉత్సవాల సందర్భంగా కోల్‌కతాలోని ఇస్కాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇస్కాన్ ఆలయంలో పూజల సందర్భంగా మమతా, కొవ్వొత్తులతో హారతి ఇచ్చారు. రథయాత్రలో జగన్నాథుని దర్శనం చేసుకున్న తర్వాత రథాన్ని కూడా లాగారు. భక్తులు, సన్యాసులతో కలిసి రథయాత్రలో రథాన్ని లాగడానికి ముందు రథంపై ఉండే శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర దేవతలకు ఆమె ప్రార్థనలు చేశారు. ఈ పవిత్రమైన రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికీ, ఇస్కాన్ సోదర సోదరీమణులు, భక్తులందరికీ జై జగన్నాథ్ అని మమతా బెనర్జీ చెప్పారు. ఇక్కడ అన్ని మతాల ప్రజలూ కలిసి జీవిస్తున్నారు. మనందరికీ జగన్నాథుడు ఎంతో పవిత్రమైన దైవం అన్నారు. ఒడిశాలోని పూరిలో జరిగిన రథయాత్రలో రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అలాగే, బెంగాల్‌లోని సముద్రతీర పర్యాటక పట్టణం దిఘాలో పూరీ జగన్నాథ ఆలయానికి ప్రతిరూపమైన ఆలయం దాదాపుగా పూర్తయిందని, దుర్గాపూజ తర్వాత దాన్ని ప్రారంభిస్తామని మమతా బెనర్జీ ఈ సందర్భంగా తెలిపారు. వచ్చే ఏడాది నుంచి దిఘాలో రథయాత్ర నిర్వహిస్తామని భక్తులకు తెలియజేశారు. కాగా, ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పూరీ జగన్నాథ రథయాత్ర ఆదివారం ప్రారంభమైంది. ఐదు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న ఈ రథయాత్రను ఈసారి కూడా అత్యంత వైభవంగా రెండు రోజుల పాటు నిర్వహిస్తారు.

Advertisement

Next Story

Most Viewed