విమాన చార్జీలను తగ్గించడంపై దృష్టి: విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు

by S Gopi |
విమాన చార్జీలను తగ్గించడంపై దృష్టి: విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం పలు కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు. సహాయ మంత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రతి ఒక్కరికీ విమాన ప్రయాణం అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇది సాధ్యం కావాలంటే విమాన టికెట్ ధరలు అందుబాటులోకి రావాలని అన్నారు. ఇదే సమయంలో తనకు గెలుపును అందించిన శ్రీకాకుళం ప్రజలకు రుణపడి ఉంటానని చెప్పారు. చిన్న వయసులో అతిపెద్ద బాధ్యతలు అప్పగించారని, వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు. దేశంలోని యువతకు ప్రధాని మోడీ ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో అనేందుకు తానే నిదర్శనమన్నారు. తనను విమానయాన శాఖ మంత్రిగా ప్రకటించినప్పటి నుంచి ఎక్కడికి వెళ్లినా, ఇదివరకు కూడా ముఖ్యంగా కొవిడ్ సమయంలో విమాన ఛార్జీల గురించి ఎక్కువమంది ప్రస్తావించారు. కాబట్టి నాకూ ఈ సమస్యపై పూర్తి అవగాహన అవసరమని భావిస్తున్నాను. త్వరలో దీనిపై చర్చిస్తానని మంత్రి వివరించారు. సమీక్షా సమావేశాలను నిర్వహించి సామాన్యులకు సవాలుగా ఉన్న టికెట్ ధరలను తగ్గించడం తన లక్ష్యమన్నారు.

ప్రధాని మోడీ లక్ష్యాలకు అనుగుణంగ మంత్రిత్వ శాఖలోనూ 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేస్తామని రామ్మోహన్ నాయుడు చెప్పారు. టెక్నాలజీ వినియోగంతో పాటు విమానయాన రంగాన్ని అభివృద్ధి చేస్తాం. సామాన్యులకు విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తేవడమే కాకుండా ప్రయాణీకుల భద్రత, సౌకర్యాన్ని అందించే చర్యలు తీసుకుంటానన్నారు. ముఖ్యంగా ఎయిర్‌పోర్టులను పర్యావరణ హితంగా చేయడం, టైర్2, టైర్3 నగరాలకూ విమానాశ్రయాలు తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు పేర్కొన్నారు.

పరిశ్రమ వర్గాల ప్రకారం, విమాన ఇంధన ధరలు పెరగడం, రూపాయి విలువ క్షీణించడం, విమాన రంగంలో కంపెనీలు తగ్గడం, ఇంజన్ సరఫరా సమస్యల కారణంగా విమానాలు నిలిచిపోవడం వంటివి దేశంలో విమాన ఛార్జీల పెరుగుదలకు కారణం. కోల్‌కతా-బాగ్‌డోగ్రా, ఢిల్లీ-బెంగళూరు, ఢిల్లీ-ముంబై వంటి ప్రధాన దేశీయ రూట్లలో విమాన ఛార్జీలు ఈ ఏడాది మేలో 12.7 శాతం వరకు పెరిగాయని థామస్ కుక్(ఇండియా), ఎస్ఓటీసీ ట్రావెల్ డేటా వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed