China: చైనాను వణికిస్తున్న మరో వైరస్.. భారీగా పెరిగిన హెచ్ఎంపీవీ కేసులు

by Shamantha N |
China: చైనాను వణికిస్తున్న మరో వైరస్.. భారీగా పెరిగిన హెచ్ఎంపీవీ కేసులు
X

దిశ, నేషనల్ బ్యూరో: చైనా (China)లో హ్యూమన్‌ మెటానిమోవైరస్‌ (HMPV) వ్యాప్తి తీవ్రతరంగా మారింది. గతనెలలో కేసుల పెరుగుదల తీవ్రంగా మారిందని స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రజలు పెద్ద ఎత్తున ఆసుపత్రుల (HMPV Outbreak) ఎదుట క్యూ కట్టారంటూ వస్తోన్న వార్తలు మరోసారి ఆందోళనకు గురిచేస్తున్నాయి. డిసెంబర్ 16 నుండి 22 వరకు.. ఒక్క వారంలో మొత్తం ఇన్‌ఫెక్షన్లలో పెరుగుదల తీవ్రంగ పెరిగిందని తెలుస్తోంది. సోషల్ మీడియాలో చైనా మరో మహమ్మారితో పోరాడుతోందని.. అక్కడ హెల్త్ ఎమర్జెన్సీ ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. కానీ, చైనా ఆరోగ్య అధికారుల నుంచి మాత్రం అత్యవసర పరిస్థితి గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఏప్రిల్ 2024లో వైరాలజీ జర్నల్‌లో వచ్చిన స్టోరీ ప్రకారం, కొవిడ్ తర్వాత చైనాలో హెచ్ఎంపీవీ కేసులో భారీగా పెరిగాయి. 2023లో ఏప్రిల్ 29 నుంచి జూన్ 5 వరకు దాదాపుగా రోజూ హెచ్ఎంపీవీ ఇన్ ఫెక్షన్లను కనుగొన్నారని ఆ స్టోరీ తెలిపింది. చైనాలో వైరస్ వ్యాప్తి చెందుతున్నందున ఆసియా దేశాలు కూడా ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దృష్టిసారించాయి.

హెచ్‌ఎంపీవీ (HMPV) వైరస్ లక్షణాలు

2001లోనే గుర్తించిన హెచ్ఎంపీవీ (HMPV) వైరస్ ని గుర్తించారు. ఆ వైరస్ లక్షణాలు (HMPV virus Symptoms) ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయని వైద్య నిపుణులు వెల్లడించారు. దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కనిపిస్తాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో బ్రాంకైటిస్, నిమోనియాకు దారితీయవచ్చు. వ్యాధి లక్షణాలు బయటకు కనిపించడానికి మూడు నుంచి ఆరు రోజులు పడుతుంది. అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం.. చిన్నారులు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగిన వ్యక్తులు దీనిబారిన పడే అవకాశాలు ఎక్కువ అని పేర్కొంది. ఈ వ్యాప్తిని నిరోధించడానికి చేతులు శుభ్రంగా కడుక్కోవాలని.. అనారోగ్యంతో ఉన్నవారితో కాంటాక్ట్ లో ఉండొద్దని డాక్టర్ల సూచించారు. అయితే, ఈ వైరస్ కు చికిత్స లేదా వ్యాక్సిన్ అందుబాటులో లేదు. వైరస్ గురించి సరైన అవగాహన, ముందు జాగ్రత్తలు నివారణకు అవసరం అని పేర్కొన్నారు.

Advertisement

Next Story