ఆడుకుంటుండగా కారు డోర్ లాక్.. ఊపిరాడక నలుగురు చిన్నారులు మృతి

by vinod kumar |   ( Updated:2024-11-04 15:17:25.0  )
ఆడుకుంటుండగా కారు డోర్ లాక్.. ఊపిరాడక నలుగురు చిన్నారులు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: గుజరాత్‌లో అత్యంత విషాద ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు ఆడుకుంటుండగా అకస్మాత్తుగా కారు డోర్ లాక్ అయింది. దీంతో ఊపిరాడక కారులోనే పిల్లలందరూ ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాకు చెందిన దంపతులు గుజరాత్‌ రాష్ట్రం ఆమ్రేలీ జిల్లాలోని రంధియా గ్రామంలో కూలీపనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఆదివారం వారి ఏడుగురు పిల్లలను ఇంటి దగ్గర విడిచి పెట్టి పనికి వెళ్లారు. ఈ క్రమంలోనే నలుగురు చిన్నారులు ఆడుకుంటూ ఇంటికి సమీపంలో పార్క్ చేసిన ఓ కారులోకి దూరారు. ఈ సమయంలో కారు డోర్ లాక్ అయింది. దీంతో నలుగురు చిన్నారులు ఊపిరాడక కారులోనే మరణించారు. సాయంత్రం తల్లి దండ్రులు ఇంటికి తిరిగి రాగా వారి పిల్లలు కనిపించలేదు. స్థానికుల సాయంతో చుట్టుపక్కల వెతకగా కారులో మృతి చెంది కనిపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో ఇద్దరు బాలురు, బాలికలు ఉన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారిని సునీత (7), సావిత్రి (4), కార్తీక్ (2), విష్ణు (2)గా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను వారి స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

Advertisement

Next Story