ఎన్సీపీ జాతీయ బాధ్యతలకు సుప్రియ..! కొత్త నాయకత్వం ఎంపికపై కసరత్తు

by Vinod kumar |   ( Updated:2023-05-03 16:49:49.0  )
ఎన్సీపీ జాతీయ బాధ్యతలకు సుప్రియ..! కొత్త నాయకత్వం ఎంపికపై కసరత్తు
X

ముంబై: ఎన్సీపీ అధ్యక్ష పదవికి శరద్‌ పవార్‌ మంగళవారం రాజీనామా చేయడంతో.. ఇప్పుడు వారసుల ఎంపికపై ఆ పార్టీ దృష్టి సారించింది. ఈ తరుణంలో పవార్‌ కుమార్తె సుప్రియా సూలే, సమీప బంధువు అజిత్‌పవార్‌ పేర్లు తెరపైకి వచ్చాయి. వీరి పేర్లను ఎన్సీపీ సీనియర్‌ నేత ఛగన్‌ భుజ్‌బల్‌ సిఫార్సు చేశారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న సుప్రియను పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా నియమించాలని, రాష్ట్ర బాధ్యతలను అజిత్‌కు అప్పగించాలని అయన పేర్కొన్నారు. ఎన్సీపీ అధినాయకత్వ బాధ్యతల కోసం పరిశీలనలో ఉన్న పేర్లను వెల్లడించడం ఇదే తొలిసారి. ఎన్సీపీని భవిష్యత్తులో నడిపించే నాయకత్వ ఎంపిక కోసం శరద్‌ పవార్‌ ఓ కమిటీని ఏర్పాటు చేశారు.

ఇందులో ఛగన్‌ కూడా సభ్యుడిగా ఉన్నారు. ‘‘రాజీనామా నిర్ణయాన్ని విరమించుకోవాలని మేం శరద్‌ పవార్‌ ను కోరాం. కానీ ఆయన వినడం లేదు. అందుకే ఈవిధంగా భావి నాయకత్వం ఎంపిక జరిగితే బాగుంటుందని నేను భావిస్తున్నా" అని ఛగన్‌ బుధవారం ఉదయం బాంద్రాలో విలేకర్లకు చెప్పారు. పార్టీ నాయకత్వం ఎంపిక కమిటీలో ఉన్న మరో సీనియర్ నాయకుడు ప్రఫుల్‌ పటేల్‌ మాట్లాడుతూ.. పవార్ వారసుడిని ఖరారు చేసేందుకు ఎన్సీపీ సీనియర్ నేతల సమావేశమేదీ జరగలేదన్నారు. ఛగన్‌ భుజ్‌బల్‌ వ్యాఖ్యలపై ప్రఫుల్‌ పటేల్‌ స్పందిస్తూ.. అది ఛగన్‌వ్యక్తిగత అభిప్రాయమన్నారు. ఎన్సీపీ అధ్యక్ష పదవికి మీ పేరు కూడా చర్చకు వచ్చిందా? అని మీడియా ప్రశ్నించగా.. తాను పోటీలో లేనని తేల్చి చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed