Chandrachud: సుప్రీంకోర్టును ప్రతిపక్షంగా భావించొద్దు.. సీజేఐ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు

by vinod kumar |   ( Updated:2024-10-19 11:38:13.0  )
Chandrachud: సుప్రీంకోర్టును ప్రతిపక్షంగా భావించొద్దు.. సీజేఐ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అత్యున్నత న్యాయస్థానం ప్రజాకోర్టుగా తన పాత్రను కాపాడుకోవాలని సూచించారు. కోర్టును పార్లమెంటులో ప్రతిపక్షంగా భావించొద్దని తెలిపారు. దక్షిణ గోవాలో శనివారం జరిగిన తొలి సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ (ఎస్‌సీఏఓఆర్‌ఏ) సదస్సులో ఆయన ప్రసంగించారు. కోర్టును విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, కానీ కేసుల ఫలితాలు, స్వభావం ఆధారంగా న్యాయస్థానం పనిని అంచనా వేయొద్దన్నారు. పార్లమెంటులో ప్రతిపక్షంగా వ్యవహరించడం సుప్రీంకోర్టు బాధ్యత కాదని స్పష్టం చేశారు. అత్యున్నత న్యాయస్థానం గత 75ఏళ్లలో ఎంతో అభివృద్ధి చెందిందని, దానిని అలాగే కొనసాగించాలని తెలిపారు.

ప్రధాన కేసులపై మాత్రమే దృష్టి పెట్టాలనే భావన న్యాయమూర్తుల్లో ఉందని, కానీ ఆ అభిప్రాయం సరికాదన్నారు. సుప్రీంకోర్టు ప్రజల న్యాయస్థానం అని, దాని పాత్రను మరింత కీలకంగా కొనసాగించాలని తెలిపారు. నిర్ణయాలు అనుకూలంగా ఉన్నప్పుడు కోర్టును ప్రశంశిస్తారని, కానీ తీర్పులు సరిగా లేకపోతే విమర్శలు సైతం ఎదురవుతాయని నొక్కి చెప్పారు. ఇది చాలా ప్రమాదకర విషయంగా తాను భావిస్తున్నానని చెప్పారు. లైవ్ టెలికాస్ట్ అనేది సుప్రీంకోర్టు పనిని ప్రజల హృదయాల్లోకి తీసుకెళ్లిందని కొనియాడారు.

Advertisement

Next Story

Most Viewed