ఆ మసాలా ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారకాలు.. శాంపిళ్ల సేకరణకు కేంద్రం ఆదేశాలు

by Hajipasha |   ( Updated:2024-04-22 14:29:41.0  )
ఆ మసాలా ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారకాలు.. శాంపిళ్ల సేకరణకు కేంద్రం ఆదేశాలు
X

దిశ, నేషనల్ బ్యూరో : ఎవరెస్ట్, ఎండీహెచ్ కంపెనీలకు చెందిన పలు మసాలా ఉత్పత్తులపై సింగపూర్, హాంకాంగ్ నిషేధం విధించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఆయా మసాలా ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారక ఇథిలీన్ ఆక్సైడ్ ఉందని సింగపూర్, హాంకాంగ్ గుర్తించిన నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యలను చేపట్టే దిశగా సర్కారు నడుం బిగించింది. మనదేశంలోని అన్ని మసాలా ఉత్పత్తులకు సంబంధించిన శాంపిళ్లను సేకరించాలని భారత సర్కారు సంబంధిత విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు దేశంలోని ఫుడ్ కమిషనర్లు అందరినీ అప్రమత్తం చేసింది. ఇప్పటికే అన్ని కంపెనీల మసాలా ఉత్పత్తుల శాంపిళ్ల సేకరణ ప్రక్రియ ప్రారంభమైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మూడు నాలుగు రోజుల్లోగా దేశంలోని అన్ని ప్రముఖ కంపెనీల మసాలా ఉత్పత్తుల తయారీ యూనిట్ల నుంచి శాంపిళ్ల సేకరణ పూర్తవుతుందని తెలిపాయి. వాటిని ల్యాబ్‌కు పంపించాక.. తనిఖీ రిపోర్టు రావడానికి 20 రోజుల టైం పడుతుందని పేర్కొన్నాయి.

ఏమిటీ ఇథిలీన్ ఆక్సైడ్ ? అంత డేంజరా ?

ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలా ఉత్పత్తుల్లో ‘ఇథిలీన్ ఆక్సైడ్’ మూలాలను గుర్తించారు. ఇది 10.7 డిగ్రీల సెల్సీయస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద మండే స్వభావాన్ని కలిగిన రంగులేని వాయువు అని సుగంధ ద్రవ్యాల బోర్డు నిర్వచించింది. ఇథిలీన్ ఆక్సైడ్ అనేది క్రిమిసంహారకంలా, ధూమపాన ఉత్పత్తిలా, స్టెరిలైజింగ్ ఏజెంట్‌లా ప్రతికూల ప్రభావాలను కలగజేస్తుందని అంటారు. వైద్య పరికరాలను క్రిమిరహితం చేయడానికి, సుగంధ ద్రవ్యాలలోని సూక్ష్మజీవుల కాలుష్యాన్ని తగ్గించడానికి ఇథిలీన్ ఆక్సైడ్‌ను వాడుతుంటారు. దీన్ని సహజ వనరులతో పాటు నీటితో నిండిన నేల, పేడ, బురదల నుంచి ఉత్పత్తి చేయొచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)కు చెందిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (ఐఏఆర్సీ) ఇథిలీన్ ఆక్సైడ్‌ను గ్రూప్ 1 కార్సినోజెన్‌గా వర్గీకరించింది. అంటే.. దీనివల్ల మనుషుల్లో క్యాన్సర్‌‌కు కారణమయ్యే రిస్క్ ఉంటుంది. అంతేకాదు ఇది మానవ కేంద్ర నాడీ వ్యవస్థను కూడా ప్రభావితం చేయగలదు. కళ్ళు, శ్లేష్మ పొరలపై నెగెటివ్ ఎఫెక్టులను చూపిస్తుంది. ఎక్కువ సమయం పాటు ఇథిలీన్ ఆక్సైడ్‌‌కు ఎక్స్‌పోజ్ అయితే కళ్ళు, చర్మం, ముక్కు, గొంతు, ఊపిరితిత్తులలో చికాకు కలుగుతుంది.

Advertisement

Next Story

Most Viewed