Fact Checking Unit : ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఏర్పాటుకు వీల్లేదు.. కేంద్రానికి బాంబే హైకోర్టు షాక్

by Hajipasha |
Fact Checking Unit : ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఏర్పాటుకు వీల్లేదు.. కేంద్రానికి బాంబే హైకోర్టు షాక్
X

దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర ప్రభుత్వానికి బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మీడియాలో వచ్చే వార్తలు, సోషల్ మీడియాలో చేసే పోస్టులలోని నిజానిజాలను తనిఖీ చేసేందుకు ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి అనుమతినిచ్చే ‘ఐటీ సవరణ నిబంధనలు-2023’ అమలును ప్రస్తుతానికి నిలుపుదల చేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. ఆ నిబంధనలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19లకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంటూ న్యాయమూర్తి జస్టిస్ ఎ.ఎస్.చందూర్కర్ శుక్రవారం తీర్పును వెలువరించారు. ‘ఐటీ సవరణ నిబంధనలు-2023’ అమలును సవాల్ చేస్తూ స్టాండప్ కమేడియన్ కునాల్ కమ్రా బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ పేరుతో కేంద్ర ప్రభుత్వం తన సోషల్ మీడియా కంటెంట్‌ను బ్లాక్ చేయడంతో పాటు సోషల్ మీడియా అకౌంట్లను సస్పెండ్/డీయాక్టివేట్ చేయించిందని ఆయన ఆరోపించారు. ఫ్యాక్ట్ చెక్ యూనిట్ల ఏర్పాటు వెనుక ఎలాంటి దురుద్దేశమూ లేదని స్పష్టం చేస్తూ కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు ఓ అఫిడవిట్‌ను సమర్పించింది. సర్కారుపై కునాల్ కమ్రా చేసిన ఆరోపణలు సరికావని తెలిపింది. దీనిపై విచారణ జరిపిన బాంబే హైకోర్టు తాజా ఆదేశాలను జారీ చేసింది.

పరిమితికి మించిన శక్తులు పొందే యత్నం

వాస్తవానికి ఈ అంశంపై 2024 జనవరిలో న్యాయమూర్తులు జస్టిస్ జి.ఎస్.పటేల్, జస్టిస్ నీలా గోఖలేలతో కూడిన ముంబై హైకోర్టు డివిజన్ బెంచ్ స్ప్లిట్ తీర్పును వెలువరించింది. అంటే ఇద్దరు న్యాయమూర్తులు భిన్నమైన తీర్పును ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు అనుమతినిచ్చే ‘ఐటీ సవరణ నిబంధనలు-2023’ రాజ్యాంగ విరుద్ధమైనవని న్యాయమూర్తి జస్టిస్ జి.ఎస్.పటేల్ పేర్కొనగా.. ఆ నిబంధనలు బాగానే ఉన్నాయని న్యాయమూర్తి జస్టిస్ నీలా గోఖలే అప్పట్లో తెలిపారు. తాజాగా శుక్రవారం రోజు దీనిపై విచారణ జరిపిన బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.ఎస్.చందూర్కర్.. గతంలో జస్టిస్ జి.ఎస్.పటేల్ వ్యక్తం చేసిన అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. ‘ఐటీ సవరణ నిబంధనలు-2023’ ద్వారా పరిమితికి మించిన శక్తులు పొందేందుకు కేంద్ర ప్రభుత్వం యత్నించిందని ఆయన వ్యాఖ్యానించారు. ముంబై హైకోర్టు ఆదేశాలపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. వాటిపై దేశ సర్వోన్నత న్యాయస్థానం స్టే విధిస్తేనే ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఏర్పాటుకు మళ్లీ తలుపులు తెరుచుకుంటాయని న్యాయనిపుణులు అంటున్నారు.

గతేడాది ఏప్రిల్ 6న..

ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, న్యూ బ్రాడ్‌కాస్ట్ అండ్ డిజిటల్ అసోసియేషన్, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మేగజైన్స్ కూడా ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ముంబై హైకోర్టులో పిటిషన్లు వేశాయి. ఆ విభాగం ఏర్పాటు వల్ల భావన ప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలుగుతుందని, సెన్సార్‌షిప్ హక్కులు ప్రభుత్వం చేతుల్లోకి వెళ్తాయని వాదించాయి. కేంద్ర ప్రభుత్వం గతేడాది ఏప్రిల్ 6న ‘ఐటీ సవరణ నిబంధనలు-2021’లో పలు సవరణలు చేసింది. ‘ఐటీ సవరణ నిబంధనలు-2023’ను అమల్లోకి తెచ్చింది. తప్పుడు వార్తలు, సోషల్ మీడియాలోని తప్పుదోవ పట్టించే కంటెంట్‌ను గుర్తించి నిలువరించే లక్ష్యంతో ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే అంశాన్ని అందులో ప్రతిపాదించారు.

Next Story