Centre Probe : కోచింగ్ సెంటర్ దుర్ఘటనపై దర్యాప్తు.. కేంద్రం ప్రత్యేక కమిటీ

by Hajipasha |
Centre Probe : కోచింగ్ సెంటర్ దుర్ఘటనపై దర్యాప్తు.. కేంద్రం ప్రత్యేక కమిటీ
X

దిశ, నేషనల్ బ్యూరో : న్యూఢిల్లీలోని ఓల్డ్ రాజిందర్ నగర్‌లో ఉన్న రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ బేస్మెంట్‌లోకి వరదనీరు పోటెత్తి ముగ్గురు విద్యార్థులు చనిపోయిన ఘటనపై దర్యాప్తునకు కేంద్ర హోంశాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సభ్యులుగా కేంద్ర హౌజింగ్, పట్టణ వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, ఢిల్లీ ప్రభుత్వం, స్పెషల్ సీపీ, ఢిల్లీ పోలీస్, ఫైర్ అడ్వైజర్ అండ్ జేఎస్‌లు ఉంటారు. విచారణ నిర్వహించే క్రమంలో ఈ కమిటీకి కేంద్ర హోంశాఖ సారథ్యం వహిస్తుంది.

ఈ కమిటీ విచారణ నిర్వహించి 30 రోజుల్లోగా నివేదికను సమర్పిస్తుంది. బేస్మెంట్‌లోకి వరద పోటెత్తి విద్యార్థులు చనిపోయిన ఘటనకు గల కారణాలపై కమిటీ సభ్యులు దర్యాప్తు చేయనున్నారు. విద్యార్థుల మరణాలకు బాధ్యులు ఎవరు అనేది తేల్చనున్నారు. ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి ? ప్రభుత్వ విధానపరంగా చేపట్టాల్సిన మార్పులు ఏమిటి ? అనే దానిపై కేంద్ర ప్రభుత్వానికి కమిటీ సిఫార్సులు చేయనుంది. ఈవివరాలను కేంద్ర హోంశాఖ సోమవారం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది.

Advertisement

Next Story