కేంద్ర క్యాబినెట్ కమిటీలలోకి రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి

by Hajipasha |
కేంద్ర క్యాబినెట్ కమిటీలలోకి రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి
X

దిశ, నేషనల్ బ్యూరో : కేంద్రంలోని ఎన్డీయే సర్కారు వివిధ క్యాబినెట్ కమిటీలకు సభ్యుల పేర్లను ప్రకటించింది. ఎన్డీయే కూటమిలోని మిత్రపక్షాలకు చెందిన పలువురు కేంద్ర మంత్రులకు కూడా ఈ కమిటీలలో చోటు కల్పించారు. జనతాదళ్‌ సెక్యులర్‌ (జేడీఎస్), జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ), టీడీపీ మంత్రులకు తగినప్రాధాన్యం దక్కింది. కీలకమైన కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా మాత్రమే ఉన్నారు. పార్లమెంటరీ, పొలిటికల్ అఫైర్స్ క్యాబినెట్ కమిటీలలో టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు చోటు దక్కింది. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అవకాశం కల్పించారు.

ముగ్గురు దిగ్గజ నేతలున్న కమిటీలివే..

ఆర్థిక వ్యవహారాలు, భద్రతా వ్యవహారాలు, పెట్టుబడుల వ్యవహారాలు, పొలిటికల్ అఫైర్స్‌, స్కిల్- ఎంప్లాయిమెంట్, జీవనోపాధి వ్యవహారాలకు సంబంధించిన క్యాబినెట్ కమిటీలలోనూ ప్రధాని మోడీ సభ్యులుగా ఉన్నారు. అకామడేషన్, స్కిల్- ఎంప్లాయిమెంట్, జీవనోపాధి, పెట్టుబడుల వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాలు, భద్రతా వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీలలోనూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నారు. పెట్టుబడుల వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాలు, స్కిల్- ఎంప్లాయిమెంట్, జీవనోపాధి వ్యవహారాల క్యాబినెట్ కమిటీలలో సభ్యుడిగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉన్నారు.

ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ‌లో..

ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉన్నారు. వీరితో పాటు భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి (జేడీఎస్), వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పంచాయతీరాజ్ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్‌ సింగ్‌ సభ్యులుగా ఉన్నారు.

పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీలో..

పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా,ఆరోగ్యశాఖ మంత్రి జగత్ ప్రకాశ్‌ నడ్డా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉంటారు. వీరితో పాటు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, సామాజిక న్యాయం-సాధికారతశాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు.

రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీలో..

రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీలో ప్రధాని మోడీతో పాటు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, గడ్కరీ, నిర్మల సీతారామన్, పీయూష్ గోయెల్, జేపీ నడ్డా, రామ్మోహన్ నాయుడు, జితన్ రాం మాంఝీ, సర్వానంద సోనోవాల్, భూపేంద్ర యాదవ్, అన్నపూర్ణా దేవి, కిరణ్ రిజిజు, కిషన్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు.

Next Story

Most Viewed