BJP: తప్పుడు ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ.. కేసు నమోదు చేసిన పోలీసులు

by karthikeya |
BJP: తప్పుడు ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ.. కేసు నమోదు చేసిన పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటకలో వక్ఫ్ బోర్డ్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ముఖ్యంగా ఈ వ్యవహారంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య రోజూ మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే ఈ వార్ తాజాగా కేసుల వరకు చేరుకుంది. ఇటీవల వక్ఫ్ బోర్డ్ ఆక్రమణల వల్ల మనస్థాపానికి గురైనఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడని, కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు. అయితే దీనిపై మండిపడ్డ కాంగ్రెస్.. బీజేపీ ఎంపీ తప్పుడు ఆరోపణలు చేశారంటూ ఏకంగా పోలీసు కేసు పెట్టింది.

వివరాల్లోకి వెళితే.. ఇటీవల తేజస్వి సూర్య.. ‘‘కర్ణాటకలోని హవేరి జిల్లాకు చెందిన రుద్రప్ప చన్నప్ప బాలికై అనే రైతు భూమిని వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకుంది. దాంతో అతడు మనస్థాపానికి గురై సూసైడ్ చేసుకున్నాడు. అతడి మృతికి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, మంత్రి జమీర్‌ అహ్మద్‌‌లే బాధ్యత తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వ చర్యల వల్ల రైతులు కుంగిపోతున్నారు’’ అంటూ ఇటీవల సోషల్‌మీడియా వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు.

అయితే ఈ కామెంట్స్‌పై సీరియస్ అయిన హవేరీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్.. ‘‘రైతు రుద్రప్ప పంట నష్టం, రుణ భారం తట్టుకోలేక 2022 జనవరిలో ఆత్మహత్య చేసుకున్నాడు. భూ సమస్యల వల్ల కాదు’’ అంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే రైతు రుద్దరప్ప ఆత్మహత్యను వక్ఫ్ భూములకు ముడి పెడుతూ పోస్టు పెట్టి.. తేజస్వి సూర్య తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని కాంగ్రెస్ మండిపడింది. దీంతో తేజస్వీ సూర్యతో పాటు ఆయన పోస్ట్‌పై వార్తలు ప్రచురించిన 2 కన్నడ పత్రికల ఎడిటర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Next Story

Most Viewed