మంత్రి కుమారుడిపై కేసు..నలుగురు పోలీసుల సస్పెండ్!

by samatah |
మంత్రి కుమారుడిపై కేసు..నలుగురు పోలీసుల సస్పెండ్!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఓ రోడ్డు ప్రమాదం ఘటన విషయంలో మంత్రి కుమారుడిపై కేసు నమోదు చేసినందుకు నలుగురు పోలీసులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ ఘటన మధ్య ప్రదేశ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..మధ్యప్రదేశ్ వైద్య, విద్యా శాఖ రాష్ట్ర మంత్రి నరేంద్ర శివాజీ పటేల్ కుమారుడు అభిజ్ఞాన్ పటేల్, అతని స్నేహితులు శనివారం రాత్రి కారులో వెళ్తుండగా..షాపురా ప్రాంతంలో వారు ప్రయాణిస్తున్న కారు ఓ జర్నలిస్టు బైకును ఢీకొట్టింది. ప్రమాదంలో ఎటువంటి గాయాలు కానప్పటికీ ఆ జర్నలిస్టుతో వాగ్వాదానికి దిగారు. అంతేగాక ఘర్షణను అడ్డుకోబోయిన ఇద్దరు స్థానిక వ్యక్తుల పైనా దాడికి పాల్పడ్డారు. దీంతో జర్నలిస్టు ఫిర్యాదు మేరకు పోలీసులు అభిజ్ఞాన్ పటేల్‌, ఆయన స్నేహితులపై కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. అదే రోజు రాత్రి మంత్రి శివాజీ తన మద్దతుదారులతో షాపురా పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అయితే పోలీసులు తమను చిత్ర హింసలు పెట్టారని మంత్రి కుమారుడు, అతని స్నేహితులు ఆరోపించారు. దీంతో నలుగురు పోలీసులను సస్పెండ్ చేసిన ప్రభుత్వం తదుపరి విచారణకు ఆదేశించింది. సస్పెండైన పోలీసులపై విచారణ జరుగుతోందని, ఇన్వెస్టిగేషన్ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని సీనియర్ పోలీసు అధికారి మయూర్ ఖండేల్వాల్ తెలిపారు. ఈ ఘటనపై రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు జితూ పట్వారీ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. నేరాలకు మద్దతివ్వడమే ప్రభుత్వ విధానంగా మారిందని ఆరోపించారు.

Advertisement

Next Story