గంజాయితో పట్టుబడిన ఐఐటీ బాబా

by John Kora |
గంజాయితో పట్టుబడిన ఐఐటీ బాబా
X

- అది ప్రసాదమని వ్యాఖ్య

- కుంభమేళాలో ప్రతీ బాబా దగ్గర ఉంటుందన్న అభయ్

- జైపూర్‌లో బాబాను అదుపులోకి తీసుకున్న పోలీసులు

దిశ, నేషనల్ బ్యూరో: మహా కుంభమేళాలో ఐఐటీ బాబాగా అందరి దృష్టిని ఆకర్షించిన అభయ్ సింగ్ మరో సారి వార్తల్లోకి ఎక్కారు. గంజాయిని కలిగి ఉన్నాడనే కారణంతో జైపూర్ పోలీసులు అతడిని కొద్ది సేపు అదుపులోకి తీసుకున్నారు. అంతే కాకుండా నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్‌స్టెన్సెస్ (ఎన్‌డీపీఎస్) చట్టం కింద కేసు నమోదు చేశారు. జైపూర్‌లోని రిద్ధి సిద్ధి ప్రాంతంలోని ఒక హోటల్‌లో బస చేసిన ఐఐటీ బాబా.. అక్కడ గొడవ చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఐఐటీ బాబాను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అతని వద్ద గంజాయి లభించింది. అయితే అది చాలా తక్కువ పరిమాణంలోనే ఉంది. బాబా దగ్గర దొరికి గంజాయి అనుమతించదగిన పరిమితిలోనే ఉండటంతో పోలీసులు అతడిని కాసేపు నిర్బంధించి.. ఆ తర్వాత వదిలేశారు.

పోలీసుల వదిలిపెట్టిన తర్వాత అభయ్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ.. అది ప్రసాదం అని చెప్పాడు. అయితే తనపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయాన్ని ధృవీకరించాడు. నేను బస చేస్తున్న హోటల్‌కు చేరుకొని గొడవ చేస్తున్నట్లు మాకు సమాచారం అందిందని పోలీసులు చెప్పారని.. ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నారని అన్నాడు. నేను గంజాయిని కలిగి ఉన్నానని కాసేపు నిర్బంధించారు. అయితే కుంభమేళాలో ప్రతీ బాబా గంజాయిని ప్రసాదంగా తీసుకుంటారని.. వారందరినీ అరెస్టు చేస్తారా అని ఐఐటీ బాబా ప్రశ్నించారు. కాగా, పోలీసుల విచారణలో తనను తాను అఘోరీ బాబాగా చెప్పుకున్నాడు. తమ ఆచారం ప్రకారం గంజాయి సేవిస్తానని కూడా వెల్లడించాడు.

ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి అయిన అభయ్ సింగ్.. ఏరో స్పేస్ ఇంజనీర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత ఆధ్యాత్మిక పరివర్తన చెంది బాబాగా మారాడు. మహా కుంభ మేళా సందర్భంగా మీడియా దృష్టిని ఆకర్షించిన అభయ్ సింగ్.. ఆ తర్వాత ఐఐటీ బాబాగా పాపులర్ అయ్యాడు. ఇటీవల ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌లో ఇండియా ఓడిపోతుందని జోష్యం కూడా చెప్పాడు. కానీ అతను చెప్పిన దానికి భిన్నంగా ఇండియా మ్యాచ్ గెలవడం గమనార్హం.

Next Story

Most Viewed