India-Canada: తెరపైకి గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ పేరు.. మరోసారి భారత్ పై కెనడా తీవ్ర వ్యాఖ్యలు

by Shamantha N |
India-Canada: తెరపైకి గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ పేరు.. మరోసారి భారత్ పై కెనడా తీవ్ర వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్- కెనడా సంబంధాలపై ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసు చిచ్చు రాజేస్తుంది. అనుమానితుల జాబితాలో ఏకంగా భారత (India) హైకమిషనర్‌ సంజయ్‌కుమార్‌ వర్మను చేర్చిన కెనడా(Canada).. మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ (Lawrence Bishnoi gang) పేరును తెర పైకి తెచ్చింది. బిష్ణోయ్ గ్యాంగ్‌తో కలిసి భారత ఏజెంట్లు.. ప్రో ఖలీస్థానీలను లక్ష్యంగా చేసుకొని కెనడాలో పనిచేస్తున్నారని ఆరోపించింది. నిజ్జర్‌ హత్య కేసుకు సంబంధించిన దర్యాప్తు పురోగతి వివరాలను రాయల్‌ కెనడియన్‌ మౌంటెడ్‌ (RCMP) పోలీసులు మీడియాకు వివరించారు. అప్పుడే ఆర్‌సీఎంపీ అసిస్టెంట్ కమిషనర్‌ బ్రిగిట్టె గౌవిన్‌ భారత్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘కెనడాలోని దక్షిణాసియా కమ్యూనిటీని ముఖ్యంగా ప్రో-ఖలిస్థానీలను భారత ఏజెంట్లు లక్ష్యంగా చేసుకున్నారు. వీరు కొన్ని గ్రూప్‌ల సాయంతో కెనడాలో నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ప్రత్యేకించి బిష్ణోయ్‌ గ్రూప్‌ ఇందులో కీలకపాత్ర పోషిస్తోంది. ఈ గ్యాంగ్‌కు భారత ప్రభుత్వ ఏజెంట్లతో సంబంధాలు ఉన్నాయని నమ్ముతున్నాం’’ అని ఆరోపించారు.

బిష్ణోయ్ గ్యాంగ్..

మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ హత్యతో బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయం ఉన్నట్లు తేలింది. ఇలాంటి టైంలో ఆ గ్యాంగ్ పేరుని కెనడా అధికారులు ప్రస్తావించారు. ఇకపోతే బిష్ణోయ్ జైల్లో ఉండగా.. అతడి సోదరుడు, ఇతర అనుచరులు కెనడా కేంద్రంగా నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇదిలాఉండగా.. నిజ్జర్‌ హత్య కేసు అనుమానితుల జాబితాలో ట్రూడో ప్రభుత్వం భారత హైకమిషనర్‌ సంజయ్‌కుమార్‌ వర్మను చేర్చింది. దీంతో, ఇరుదేశల మధ్య వివాదం ముదిరింది. హత్యకేసు దర్యాప్తునకు భారత్ సహకరించట్లేదని ట్రూడో ఆరోపించారు. అయితే, అవన్నీ అసత్యాలని భారత్ ఖండిస్తుంది. ఎలాంటి సాక్ష్యాలు ఇవ్వకుండా నిరాధార ఆరోపణలు చేస్తోందని మండిపడింది. ఇప్పటికే ఇరుదేశాలు పరస్పరం దౌత్యవేత్తలను బహిష్కరించాయి.

Next Story