క్యాబ్ డ్రైవర్ రూ.27 కక్కుర్తి.. ఉబెర్ కు రూ.28 వేల ఫైన్.. అసలేం జరిగిందంటే?

by Prasad Jukanti |
క్యాబ్ డ్రైవర్  రూ.27 కక్కుర్తి.. ఉబెర్  కు రూ.28 వేల ఫైన్.. అసలేం జరిగిందంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో:వినియోగదారుడి వద్ద అధిక ఛార్జ్ వసూలు చేసినందుకు ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఉబెర్ ఇండియాకు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కారం కమిషన్ -చండీగఢ్ ఝలక్ ఇచ్చింది. ఓ క్యాబ్ డ్రైవర్ రూ. 27 కోసం ఆశపడితే ఏకంగా రూ. 28 వేలు జరిమానా విధించింది. చండీగఢ్ లో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. పంజాబ్ కు చెందిన రిత్విక్ గార్గ్ 2022 సెప్టెంబర్ 19న చండీగఢ్ లో ఉబేర్ కు చెందిన క్యాబ్ ను బుక్ చేసుకున్నాడు. ఆ సమయంలో యాప్ లో చార్జీ రూ.53 గా చూపించింది. అయితే జర్నీ పూర్తయ్యాక క్యాబ్ డ్రైవర్ అతడి వద్ద నుంచి ఏవేవో కారణాలు చెప్పి రూ.80 వసూలు చేశాడు. దీంతో డ్రైవర్ నిర్వాకాన్ని సదరు కస్టమర్ ఉబెర్ దృష్టికి తీసుకువెళ్లాడు. అయితే దానికి సరైన సమాధానం ఇవ్వకుండా తాము యాప్ ద్వారా కేవలం టెక్నాలజీ సర్వీస్ మాత్రమే ఇస్తామని డ్రైవర్లు, కస్టమర్లకు అనుసంధానించడం వరకే తమ పని అంటూ డొంకతిరుగుడు సమాధానాలు ఇచ్చింది. దీంతో సదరు బాధితుడు వినియోగదారుల ఫోరం ను ఆశ్రయించాడు. విచారణ జరిపిన కన్జ్యూమర్ ఫోరం ఉబర్ ఇండియా తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కస్టమర్ చెల్లించే డబ్బులో కొంత ఉబెర్ కు చేరుతున్నదని అందువల్ల ఇలాంటి వాటిలో కచ్చితంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని కమిషన్ తేల్చి చెప్పింది. అలాగే ఫిర్యాదు దారుడి వద్ద నుంచి అదనంగా తీసుకున్న రూ.27తో పాటు అతడికి రూ.5 వేల పరిహారం, రూ.3 వేల కోర్టు ఖర్చుల కింద చెల్లించాలని ఉబెర్ ఇండియాను కమిషన్ ఆదేశించింది. భవిష్యత్ లో ఇలాంటి తప్పిదాలను అడ్డుకునేందుకు కమిషన్ లీగల్ ఎయిడ్ ఖాతాలో రూ. 20 వేల జమ చేయాలని ఆదేశించింది.

Advertisement

Next Story