హర్యానా అసెంబ్లీ ఎన్నికల కోసం బీఎస్పీ- ఐఎన్‌ఎల్‌డీ పొత్తు

by Harish |   ( Updated:2024-07-11 09:01:05.0  )
హర్యానా అసెంబ్లీ ఎన్నికల కోసం బీఎస్పీ- ఐఎన్‌ఎల్‌డీ పొత్తు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఈ ఏడాది చివర్లో జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల కోసం మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ, ఇండియన్ నేషనల్ లోక్ దళ్( ఐఎన్‌ఎల్‌డీ) పార్టీలు కలిసి ఉమ్మడిగా పోటీ చేయాలని నిర్ణయించాయి. ఈ విషయాన్ని ఇరు పార్టీల నాయకులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 90 అసెంబ్లీ సీట్లలో బీఎస్పీ 37 స్థానాల్లో పోటీ చేస్తుండగా, మిగిలిన వాటిలో ఐఎన్‌ఎల్‌డీ పోటీ చేస్తుంది. ఈ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఐఎన్‌ఎల్‌డీ నేత అభయ్ చౌతాలా ఉంటారు. ఈ మహాకూటమి ఏ స్వార్థ ప్రయోజనాలతో కూడుకున్నది కాదని, ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటైందని గురువారం అభయ్ అన్నారు.

ఇటీవలే బీఎస్పీ అధినేత్రి మాయావతి, అభయ్ చౌతాలాలు పొత్తుకు సంబంధించిన సమావేశం నిర్వహించగా తాజాగా సీట్ల పంపకాల విషయంలో స్పష్టత రావడంతో ఇరు పార్టీల మధ్య ఒప్పందం ఖరారైంది. మాయావతి మేనల్లుడు ఆనంద్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే అభయ్ చౌతాలా ముఖ్యమంత్రి అవుతారని, మా మధ్య కుదిరిన ఈ ఒప్పందం కేవలం అసెంబ్లీ ఎన్నికల పోరుకే పరిమితం కాబోదని, భవిష్యత్తులో రాష్ట్రంలో జరిగే ఇతర ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేస్తామని ఆనంద్ తెలిపారు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరడం ఇదే మొదటిసారి కాదు. గతంలో 1996, 2018లోనూ కలిసి పోటీ చేశాయి. ఇప్పుడు తాజాగా 2024 ఎన్నికల కోసం మళ్ళీ ఏకమయ్యాయి.

Advertisement

Next Story