‘నీట్​’పై దద్దరిల్లిన పార్లమెంటు ఉభయసభలు.. టాప్ పాయింట్స్ ఇవే

by Hajipasha |
‘నీట్​’పై దద్దరిల్లిన పార్లమెంటు ఉభయసభలు.. టాప్ పాయింట్స్ ఇవే
X

దిశ, నేషనల్ బ్యూరో : వైద్య విద్యా కోర్సుల జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష ‘నీట్’‌లో జరిగిన అవకతవకల అంశంపై పార్లమెంటు ఉభయసభలు శుక్రవారం దద్ధరిల్లాయి. దీనిపై తక్షణం చర్చ జరపాలని విపక్ష పార్టీలు డిమాండ్‌ చేయగా.. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ అందుకు అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేశారు. విపక్షాల ఆందోళనతో లోక్‌సభ, రాజ్యసభ సోమవారానికి(జులై 1) వాయిదాపడ్డాయి. అంతకుముందు శుక్రవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ సెషన్ ప్రారంభం కాగానే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను స్పీకర్ ఓంబిర్లా ప్రారంభించారు. అయితే ప్రతిపక్షాలు నీట్‌ అంశంపై వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. విద్యార్థులు, దేశ యువత భవిష్యత్తుకు అత్యంత కీలకమైన నీట్ పేపర్‌ లీక్‌ అంశంపై సభలో చర్చ జరగాల్సిందే అని ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ కోరారు. దీనిపై సభలో అర్థవంతమైన, గౌరవప్రదమైన చర్చను ప్రధాని మోడీ చేపట్టాలన్నారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం, ప్రతిపక్షం కలిసి పనిచేస్తోందనే సందేశాన్ని పార్లమెంట్‌ ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. నీట్ అంశంపై పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాల్సిన అవసరం ఉందని రాహుల్ చెప్పారు. అయితే నీట్ అంశంపై వెంటనే చర్చ నిర్వహించేందుకు స్పీకర్ నిరాకరించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతున్నందున..ఇప్పుడే నీట్‌పై చర్చ జరపలేమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. నీట్‌పై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు స్పీకర్‌ వాయిదా వేశారు. ఆ తర్వాత సభ తిరిగి ప్రారంభమైనా పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో లోక్‌సభను సోమవారానికి (జులై 1) వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.

రాహుల్‌ గాంధీ మైక్‌ మ్యూట్..

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ నీట్ అంశాన్ని లేవనెత్తగానే మైక్‌‌ను ఆఫ్ చేశారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈమేరకు ఎక్స్ (ట్విటర్‌) వేదికగా ఒక వీడియోను షేర్‌ చేసింది. మైక్రోఫోన్‌లో మాట్లాడేందుకు వీలు కల్పించాలని స్పీకర్ ఓం బిర్లాను రాహుల్ కోరడం ఆ దృశ్యాల్లో కనిపిస్తోంది. తాను ఎంపీల మైక్రోఫోన్ స్విచ్చాఫ్‌ చేయనని, అలాంటి నియంత్రణ ఏదీ తన వద్ద లేదని స్పీకర్ స్పష్టంచేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ జరగాల్సిన సమయంలో ఇతర విషయాలు రికార్డు కావని ఆయన వెల్లడించారు.

రాజ్యసభలో ఏం జరిగిందంటే..

రాజ్యసభలోనూ నీట్‌ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. వారి ఆందోళనల నడుమ రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్ ధన్‌‌ఖర్ కొంతసేపు సభను నడిపించారు. ఈక్రమంలో కొందరు విపక్ష ఎంపీలు నిరసన తెలుపుతూ రాజ్యసభ వెల్‌లోకి దూసుకెళ్లారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ అంశంపై చర్చ జరపాలని కోరుతూ విపక్షాలు 22 నోటీసులు ఇచ్చినా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ పరిణామాల నడుమ రాజ్యసభను మధ్యాహ్నం 12 గంటల వరకు ధన్‌ఖర్ వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను రాజ్యసభలో ప్రారంభించారు. ఈక్రమంలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే కోరారు. అయితే దీనికి రాజ్యసభ ఛైర్మన్‌‌ను స్పందన రాలేదు. దీంతో ఆయన పలువురు విపక్ష ఎంపీలతో కలిసి నేరుగా రాజ్యసభ వెల్‌లోకి వెళ్లారు. తమకు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ప్రతిపక్ష సభ్యులు తమతమ స్థానాల్లో కూర్చోవాలని ఛైర్మన్‌ కోరినా వారు వినలేదు. ఈక్రమంలో రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్ ధన్‌‌ఖర్, ఖర్గే పరస్పరం వాక్బాణాలు సంధించుకున్నారు. రాజ్యసభ ప్రతిష్ఠను, పవిత్రతను విపక్షాలు దెబ్బతీస్తున్నాయని ధన్‌ఖర్ మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన అంశంపై కనీసం మాట్లాడేందుకు తమకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రాజ్యసభను కూడా జులై 1వ తేదీకి వాయిదా వేశారు. కాగా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యురాలు ఫూలోదేవి నేతమ్‌ సభలో కళ్లుతిరిగి పడిపోయారు. నీట్‌ అంశంపై కాంగ్రెస్‌ సభ్యులంతా రాజ్యసభ ఛైర్మన్‌ పోడియం దగ్గరికి వెళ్లి నిరసన తెలుపుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆమెను హుటాహుటిన అంబులెన్స్‌లో ఢిల్లీలోని రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రిలో చేర్పించారు.

Advertisement

Next Story

Most Viewed