ఈశాన్య రాష్ట్రాల్లో కమలం హవా.. రెండు రాష్ట్రాల్లో స్పష్టమైన మెజార్టీ!

by GSrikanth |
ఈశాన్య రాష్ట్రాల్లో కమలం హవా.. రెండు రాష్ట్రాల్లో స్పష్టమైన మెజార్టీ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజం చేస్తూ త్రిపుర, నాగాలాండ్ లో బీజేపీ కూటమి ముందంజలో ఉండగా మేఘాలయలో హంగ్ పరిస్థితి కనిపిస్తోంది. ఈ మూడు రాష్ట్రాల్లో 60 చొప్పున నియోజకవర్గాలు ఉండగా ప్రభుత్వ ఏర్పాటుకు 31 సీట్లలో గెలవాల్సి ఉంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం త్రిపుర, నాగాలాండ్ లో బీజేపీ మిత్ర పక్షాలకు స్పష్టమైన ఆధిక్యత ఉండగా మేఘాలయలో సీఎం కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని ఎన్ పీపీ హావా వీస్తోంది. త్రిపురలో బీజేపీ 32 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా కాంగ్రెస్- లెఫ్ట్ కూటమి 16 స్థానాలు, త్రిపా 11 స్థానాలు ఇతరులు 1 స్థానంలో లీడ్ లో కొనసాగుతున్నారు.

నాగాలాండ్‌లో బీజేపీ-ఎన్డీపీపీ కూటమి 39 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతుండగా కాంగ్రెస్ 1, ఎన్ పీఎఫ్ 2, ఇతరులు 18 స్థానాల్లో లీడ్ లో ఉన్నారు. మేఘాలయలో ఎన్ పీపీ 25 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా యూడీపీ 9, బీజేపీ 5, కాంగ్రెస్ 4, టీఎంసీ 5, ఇతరులు 11 స్థానాల్లో లీడ్ లో ఉన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావిస్తున్న ఈ ఎన్నికల ఫలితాల ట్రెండ్ చూస్తుంటే ప్రభుత్వాలు మారేలా లేదు. త్రిపురలో బీజేపీని నిలువరించేందుకు గతానికి భిన్నంగా కాంగ్రెస్ లెఫ్ట్ మధ్య పొత్తు కుదిరినా ఓటర్లు మాత్రం బీజేపీ వైపే మొగ్గుచూపారు. ఇక తమిళనాడు ఈరోడ్ ఈస్ట్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఎలాంగోవన్ ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ అధికార డీఎంకే కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చింది.

Advertisement

Next Story