Sisodia: ఢిల్లీ ఎన్నికల వేళ సిసోడియా సంచలన వ్యాఖ్యలు

by Shamantha N |
Sisodia: ఢిల్లీ ఎన్నికల వేళ సిసోడియా సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: “జైళ్లో ఉన్నప్పుడు బీజేపీ నాకు ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసింది” అని ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీశ్ సిసోడియా(Manish Sisodia) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎన్నికల వేళ ఆయన జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. తీహార్ జైళ్లో ఉన్నప్పుడు తనకు బీజేపీలో చేరానే ఆఫర్ వచ్చినట్లు చెప్పుకొచ్చారు. ఒకవేళ పార్టీ మారకుంటే.. చాలాకాలంపాటు జైళ్లోనే ఉండాల్సి వస్తుందని బెదిరింపులకు గురిచేశారని ఆరోపించారు. ‘‘నేను జైల్లో చాలా ఇబ్బందులు పడుతున్నానని బీజేపీకి అర్థమైంది. నా భార్య అనారోగ్యంగా ఉందని, కుమారుడు చదువుకుంటున్నాడనీ తెలుసు. అప్పుడే వాళ్లు నాకు ఓ అల్టిమేటం ఇచ్చారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)ను వదిలేయ్‌.. లేదా జైల్లో ఉండిపో అని చెప్పారు. నన్ను కాషాయ పార్టీలో చేరమన్నారు. ఆప్‌ (AAP) ఎమ్మెల్యేల కూటమిని విచ్ఛిన్నం చేస్తామని చెప్పారు. నన్ను ముఖ్యమంత్రిని చేస్తామని ఆఫర్‌ ఇచ్చారు’’ అని సిసోడియా (Manish Sisodia) ఆరోపించారు.

బీజేపీపై విమర్శలు

కమలం పార్టీ సిసోడియా విమర్శలు గుప్పించారు. "ప్రతిపక్ష పార్టీలను విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది. విచ్ఛిన్నం చేయని వారిని జైలుకు పంపుతారు. బీజేపీ తమ ఎజెండాతో పొత్తు పెట్టుకోవడానికి నిరాకరించిన ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుంటుందని ఆయన ఆరోపించారు. స్కూల్స్, హాస్పిటల్స్, నీరు, విద్యుత్ గురించి బీజేపీ పట్టింకోదన్నారు. రెండు దశాబ్దాలకు పైగా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వాటి గురించి పట్టించుకుంటే అక్కడి పరిస్థితులు వేరుగా ఉండేదని అన్నారు. మేం ఢిల్లీలో మౌలిక సదుపాయాలను ఉచితంగా అందిస్తున్నప్పుడు బీజేపీ మేల్కొందని ఎద్దేవా. ప్రతిచోట ప్రజలు ఇలాంటి డిమాండ్లు చేస్తారనే ఆప్ ని టార్గెట్ చేసిందన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో 2023లో సిసోడియా అరెస్టయ్యారు. దాదాపు 17 నెలలపాటు జైలులోనే ఉన్న ఆయన.. గతేడాది ఆగస్టులో విడుదలయ్యారు. ఇకపోతే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) జాంగ్‌పురా నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. 70 శాసనసభ స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఫలితాలు రానున్నాయి.

Next Story